మహిళ తిట్టిందని గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

గ్రామ వాలంటీర్ ఉద్యోగం వచ్చిందనే ఆనందం మూడు నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. విధుల్లో చేరి నెల రోజులు గడవక ముందే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో చోటుచేసుకుంది.
జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న పండు నవీన(23) తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. గ్రామ వాలంటీర్ గా నియమితులైన నవీన గ్రామంలో వివరాలు సేకరిస్తుండగా గ్రామానికి చెందిన మంగ అనే మహిళ తన ఆధార్ కార్డు ఎందుకు ఆన్ లైన్ చేయ్యట్లేదని నవీనను గట్టిగా ప్రశ్నించింది.
దీంతో సదరు మహిళ మాటలకు మనస్తాపానికి గురైన నవీన రోదిస్తూ ఇంటికి వచ్చి తండ్రి శ్రీరామమూర్తికి జరిగిన విషయం చెప్పింది. తండ్రి కూతురిని వారించి పొలం పనులకు వెళ్లిపోగా ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో నవీన ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్లు నవీన తండ్రి శ్రీరామ్మూర్తి వెల్లడించారు. శ్రీరామ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.