జీఎన్‌ రావు కమిటీ నివేదికలో ఏముంది? 

జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 02:39 AM IST
జీఎన్‌ రావు కమిటీ నివేదికలో ఏముంది? 

Updated On : December 27, 2019 / 2:39 AM IST

జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది. భవిష్యత్‌లో నిర్మించే వాటిని మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. ఏపీలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని రాజధానిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర అభివృద్ధి ఏవిధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేసిన కమిటీ..  తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు సీఎం జగన్‌కు 125 పేజీల నివేదికను సమర్పించారు. 

గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని జీఎన్‌రావు చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. తీర ప్రాంతంపై అభివృద్ధి ఒత్తిడి ఎక్కువుందని, అభివృద్ధిని మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రకటించారు. సమగ్ర అభివృద్ధి కోసం అనుసరించాల్సిన విధానాలను… ప్రభుత్వానికి సిఫార్సు చేశామని జీఎన్‌రావు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి జిల్లాలోను పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని కమిటీ పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ… అభివృద్ధి చేసుకోవాలని కమిటీ సభ్యులు సూచించారు.

వరద ముంపులేని రాజధాని ఉండాలని జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉందని తెలిపింది. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి తప్పనిసరి అని సూచించామని కమిటీ తెలిపింది. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాను కలిపి మధ్య కోస్తా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో దక్షిణ కోస్తా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో రాయలసీమ రీజియన్లుగా విభజించాలని పేర్కొంది. కర్ణాటక తరహాలో రీజినల్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలన్న కమిటీ.. ఏపీ రాజధానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

అమరావతి, మంగళగిరి కాంప్లెక్సు, విశాఖ మెట్రో సిటీ, కర్నూలు, రాయలసీమకు సంబంధించి మూడు కీలకమైన ప్రతిపాదనలు చేసింది. అమరావతి పరిధిలో హైకోర్టు బెంచ్‌తో పాటు అసెంబ్లీ, ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్‌ నివాస భవనం ఉండాలని సిఫార్సు చేసింది. విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్‌, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొంది. విశాఖలో అసెంబ్లీ వేసవికాల సమావేశాల నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఇక కర్నూలులో హైకోర్టు, దానికి సంబంధించిన కోర్టులన్నీ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రీబాగ్‌ ఒప్పందంలో ఈ విషయం ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.