కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

  • Published By: vamsi ,Published On : March 16, 2019 / 07:31 AM IST
కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

Updated On : March 16, 2019 / 7:31 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలను  పెండింగ్‌లో పెట్టారు. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న కోమటిరెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించినా కూడా ఆయనకు ఫస్ట్ లిస్ట్‌లో కాంగ్రెస్ అవకాశం ఇవ్వలేదు. 

అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభలను ఎదుర్కొన్న కాంగ్రెస్‌… పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా… ఈ ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా తన కంచుకోటగా ప్రకటించుకున్న కాంగ్రెస్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ జానారెడ్డి, కోమటిరెడ్డిలాంటి నేతలు కూడా ఓడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే గెలిచినవారిలో కూడా కోమటిరెడ్డి పట్టుబట్టి నకిరేకల్ టిక్కెట్ ఇప్పించుకున్న నమ్మినబంటు చిరుమర్తి లింగయ్య అధికార కారు ఎక్కేశారు. 
Read Also : ఎక్కడ పుట్టాడో అక్కడికే : టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి

కోమటిరెడ్డి వత్తిడితో చిరుమర్తికి టికెట్ కేటాయించిన కాంగ్రెస్ హైకమాండ్ లింగయ్య పార్టీ మారితే కోమటిరెడ్డి పట్టించుకోలేదని, అందుకే ఫస్ట్ లిస్ట్‌లో కోమటిరెడ్డికి సీటు ఖరారు చేయలేదని చెబుతున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తికి రాకుంటే.. తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటాననే రీతిలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరుమర్తి పార్టీ మారుతుంటే అడ్డుకోలేకపోయాడని అందుకే ఫస్ట్‌లిస్ట్‌లో కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అయితే భువనగిరి పార్లమెంటు స్థానం నుండి కోమటిరెడ్డికి సీటు ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరితోపాటు మునుగోడు, ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. తుంగతుర్తిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో బలమైన అభ్యర్థి తోడైతే కాంగ్రెస్‌కు గెలుపు నల్లేరుపై నడకేనని కేడర్‌ భావిస్తోంది. ఈ స్థానాన్ని మొదటి నుంచి మధుయాష్కి కూడా కోరుతుండగా.. ఇప్పుడు ఆయన తప్పుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు భువనగిరి పార్లమెంటు అభ్యర్ధిత్వానికి ఖరారైనట్లు తెలుస్తుంది.