హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

హోలి అనేది రంగుల పండుగ ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ (“వసంతోత్సవ పండుగ”) అని అంటారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం ఈ పండుగ నాడు రకలరకాల పూవులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వారి సంతోషాన్ని పంచుకొనేవారట. కాని ఈ రోజుల్లో పూవుల స్థానంలో రకరకాల రంగులు వచ్చిచేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి ఒకరిపై ఒకరు చల్లుకొంటారు. ఇలా చల్లుకోవడం వల్ల ప్రేమతో పాటు సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని అందరూ భావిస్తారు.
ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించబడింది. హోళీని హోళికా పుర్ణిమగా కూడ వ్యవహరిస్తూవుంటారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.
* మార్చి 21 నే ఎందుకు జరుపుకుంటారు?
రాక్షస రాజు హిరణ్యకశపుడు కుమారుడైనా ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది తన తండ్రికి నచ్చదు. దాంతో విష్ణు చింతనతో కాలం వెళ్లబుచ్చే ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయంచుకొన్నాడు హిరణ్యకశపుడు. ఒకరోజు హిరణ్యకశపుడు తన సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకున్న వరంతో ప్రహ్లాదుణ్ణి మంటలకు ఆహుతి చేయమని చెబుతాడు. ఆ హోలీక తన సోదరుని కోరిక తీర్చడానికి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. కానీ విష్ణుమాయవల్ల హోలిక ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ప్రహ్లాదుడు మాత్రం సజీవుడై నిలిచాడు. హోలిక దహనమైన రోజు కనుక హోలీ పండుగను చేసుకొంటారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు.