జమ్మలమడుగు రాజకీయం : ఆది, సుబ్బారెడ్డి కలయిక టీడీపీకి కలిసొస్తుందా
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ

కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ముగియడంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. విజయం తమదంటే తమదంటూ అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలయిక టీడీపీకి విజయం తీసుకువస్తుందా… లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 30ఏళ్లుగా బద్ద శత్రువులు ఇరువురు ఏకం కావడమే ఇందుకు కారణం. మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరు ఎన్నికలకు ముందు కలిసి, ఎన్నికల్లో పోటీ చేయడంతో.. ఇక్కడి రాజకీయాలపై అందరి చూపు పడింది. రామసుబ్బారెడ్డి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో .. ఆయన గెలుపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రామసుబ్బారెడ్డికి బద్ద శత్రువుగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఎన్నికల్లో సహకరించారా, సహకరిస్తే వారి గెలుపు ఖాయమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి ఆదినారాయణరెడ్డి .. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్‌కు టీడీపీ నుంచి పోటీచేశారు. ఇక రామసుబ్బారెడ్డి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆదినారాయణ రెడ్డికంటే కూడా రామసుబ్బారెడ్డి గెలుపు పైనే .. ప్రతిఒక్కరూ ఫోకస్ పెడుతున్నారు.
కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగు పట్టుకొమ్మ అని చెప్పొచ్చు. ఇటువంటి సమయంలో జమ్మలమడుగులో టీడీపీ విజయం నల్లేరుపై నడక వంటిదని చెప్పలేం. బద్దశత్రువులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి ఇరువురు ఏకమైన తర్వాత .. అందరూ టీడీపీ గెలుపు ఖాయమని చెబుతూ వచ్చారు. ఓటింగ్ తర్వాత అంచనాలు తారుమారు అయ్యాయని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. నాయకులు కలిసినా, క్యాడర్ కలవలేదనేది వారి వాదన. ఇదే నిజమైతే టీడీపీకి గెలుపు కష్టమే.
వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా, క్యాడర్ బలంగా ఉండడంతో .. కలిసొచ్చిందనేది రాజకీయ నాయకులు విశ్లేషణ. కడప పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగుపై ప్రత్యేక దృష్టి పెట్టి క్యాడర్‌ను కాపాడుకోవడం వల్లే, గట్టి పోటీకి కారణం అని చెప్పవచ్చు. అంతేకాకుండా జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనడంతో.. గెలుపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పెరిగిన ఓటింగ్ ఆది వర్గానికి అనుకూలిస్తుందా .. లేక ప్రతికూలిస్తుందా అని పలువురు పందేలకు తెరతీస్తున్నారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో జమ్మలమడుగు కోటలో జెండా పాతేదెవరోనని అంతా చర్చించుకుంటున్నారు. టీడీపీ తరపున నేతలు మాత్రమే కలిశారా, క్యాడర్ కూడా కలిసిందా అనేది .. ఫలితాలు వెలువడితే కానీ తెలియదు.