చిట్టితల్లి ప్రాణం తీసిన భార్య భర్తల గొడవ : కొండపై బిడ్డను పూడ్చిపెట్టిన తల్లి..

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 10:21 AM IST
చిట్టితల్లి ప్రాణం తీసిన భార్య భర్తల గొడవ : కొండపై బిడ్డను పూడ్చిపెట్టిన తల్లి..

Updated On : February 12, 2020 / 10:21 AM IST

భార్య భర్త మధ్య గొడవలతో అనాధలుగా మారిపోతున్న చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి  పరిధిలోని పులగాని పాలెంలో భార్యాభర్త మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అత్తింటి వారితో గొడవపడి ఏడాదిన్నర కూతురితో కలిసి కుసుమలత అనే మహిళ తన చిన్నారితో కలిసి  ఆత్మహత్యకుయత్నించింది. ఈ క్రమంలో చిన్నారి చనిపోయింది. కానీ ఆ తల్లిమాత్రం తీవ్ర గాయాలతో బైటపడింది. బిడ్డను చంపుకుని ఎందుకు బతికి ఉన్నానా అని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. 

వివరాలు.. పెందుర్తి  పరిధిలోని పులగాని పాలెంలో కుసుమలత  భర్త, 18 నెలల కూతురు జ్ఞానసతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు పెద్దవయ్యాయి. అత్తవారికి కుసుమలతకు పడలేదు.  దీంతో కుసుమలత ఫిబ్రవరి 6న తన బిడ్డ జ్ఞానసను తీసుకుని ఇంటి నుంచి వెళ్లి పోయింది. అలా వెళ్లిపోయిన ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చలేకపోయింది.కళ్లముందే బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఏం చేయలేక నిస్సహాయపరిస్ధితిలో ఉండిపోయింది. ఎంతోమందిని వేడుకుంది. కానీ ఫలితంలేకపోయింది. దీంతో ఆకలితో అల్లాడిపోతూ గుక్కపెట్టి ఏడుస్తూ బిడ్డ తల్లడిల్లిపోవటం ఆ మాతృహృదయాన్ని బద్దలు చేసింది. 

సరిగ్గా అదే రోజు తన భార్య, కూతురు కనపడటం లేదని ఈనెల 6వ తేదిన పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కుసుమలత భర్త ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి మహిళ కోసం గాలించారు పోలీసులు. కానీ ఎంతకూ తల్లీ కూతుళ్ల జాడ తెలియరాలేదు. 
ఈ క్రమంలో ఫిబ్రవరి 12న పగలు కూడా వెళ్లటానికి భయపడే కాటమయ్య కొండమీద  ఓ మహిళ అపస్మారక స్థితిలో  కనిపించిందని స్థానిక పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను కుసుమలతగా గుర్తించారు. పాప ఏదని కుసుమలత తల్లిని విచారించగా తన కూతురు చనిపోయిందని, కాటమయ్య కొండ ప్రాంతంలో పాతి పెట్టానని  చెప్పింది. 

ఈ క్రమంలో కొండపైన పోలీసులు డాగ్ స్వాడ్ తో సహా తీవ్రంగా గాలించారు. కానీ పాపను పాతిపెట్టిన ప్రాంతాన్ని తెలుసుకోలేకపోయారు. దీంతో 50 మంది పోలీసులు పలు బృందాలుగా విడిపోయి మూడు రోజులపాటు గాలించారు. అలా ఎట్టకేలకు కొండపై చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్నిపోలీసులు కనుగొన్నారు. 

కాగా..పట్టపగలు కాటమయ్య కొండపైకి వెళ్లాలంటే స్థానికులు భయపడిపోతారు. కానీ కుసుమలత అటువంటి కొండపై నాలుగు రోజుల పాటు ఎలా ఉండగలిగిందోనని పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కుసుమలత శరీరంపై తీవ్రంగా గాయాలు ఉండటం..ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేకపోవటంతో పోలీసులు ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ కేసుపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బిడ్డతో పాటు ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? లేక బిడ్డను తానే చంపేసిందా? అనే కోణంలో  దర్యాప్తు ముమ్మరం చేశారు.