Kris Srikkanth : ఈ జట్టుతో ఆసియాకప్ గెలుస్తారేమో గానీ.. సెలక్టర్లను ఉతికి ఆరేసిన క్రిస్..
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టుపై మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) పెదవి విరిచాడు.

Kris Srikkanth slams Ajit Agarkar led selection committee over T20 Asia Cup 2025 squad
Kris Srikkanth : ఆసియా కప్ 2025 కోసం మంగళవారం 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. కాగా.. ఈ జట్టుపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) పెదవి విరిచాడు. సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ఆటగాళ్లను కాదని, నామమాత్రంగా ఆడిన ఆటగాళ్లను తీసుకోవడం పై మండిపడ్డాడు. ఈ జట్టుతో యూఏఈ వేదికగా జరిగే ఆసియాకప్ 2025 గెలవవచ్చు ఏమో గానీ, వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ 2026ని మాత్రం గెలవలేం చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోనే భారత్ ఆసియా కప్ 2025లో బరిలోకి దిగనుంది. ఏడాది తరువాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు శుభ్‌మన్ గిల్. అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఏడాదిగా సూర్యకు డిప్యూటీగా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను పదవిని కోల్పోయాడు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు గానీ.. ఇటీవలి కాలంలో పెద్దగా రాణించని శివమ్ దూబే, రింకూ సింగ్‌లతో పాటు యువ పేసర్ హర్షిత్ రాణాలకు జట్టులో చోటు దక్కింది.
Asia Cup 2025 : జట్టు కోసం ఆడే ఆటగాళ్లని తీసుకోరా? రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్..
దీనిపైనే శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘మహా అయితే మనం ఈ జట్టుతో ఆసియా కప్‌ను గెలుస్తామేమో కానీ ఇదే జట్టుతో టీ20 ప్రపంచకప్‌ను గెలవలేం. టీ20 ప్రపంచకప్ 2026కు ఇదే జట్టును తీసుకువెళతారా? ఈ మెగా టోర్నీకి మరో ఆరు నెలల సమయమే ఉంది? సన్నాహకాలు సరిగ్గా మాత్రం లేవు.’ అని అన్నాడు.
అక్షర్ పటేల్‌ను ఎందుకు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారని ప్రశ్నించాడు. రింకూ సింక్, శివమ్ దూబే, హర్షిత్ రాణాలకు ఎలా జట్టులో చోటు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. జట్టుకు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికంగా భావిస్తే.. వీరిని ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో యశస్వి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంతకంటే అతడు ఏం చేస్తే జట్టులోకి తీసుకుంటారో చెప్పండి అంటూ మండిపడ్డాడు.
ఇక ఐదో స్థానంలో ఎవరిని ఆడిస్తారో చెప్పాలన్నాడు. సాధారణంగా హార్దిక్ పాండ్యా ఆ స్థానంలో ఆడతాడని ఇప్పుడు సంజూ శాంసన్, రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండడంతో ఎవరిని ఆడిస్తారని అడిగారు. వీరందరూ ఉండగా శివమ్ దూబెను ఎక్కడ ఆడిస్తారని ప్రశ్నించాడు.