సీఎస్‌పై యనమల ఫైర్ : ఆపద్దర్మ ప్రభుత్వం కాదు..ప్రజా ప్రభుత్వం

ఏపీ రాష్ట్రంలో సీఎస్..వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఉంది. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. విమర్శలు..ఆరోపణలతో విరుచుకపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. సీఎం చంద్రబాబుతో సహా ఇతర నేతలు సీఎస్ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. తాజాగా యనమల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ లేకుండా గవర్నెన్స్ గురించి ఏ రాజ్యాంగం చెప్పింది..? బ్యూరోక్రాట్లు రాజ్యం చేయవచ్చని ఎక్కడైనా చెప్పారా..? రాజ్యాంగం కంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతీతమా..? అంటూ మాటల తూటాలు పేల్చారు యనమల.
ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆయన మాట్లాడుతూ…ప్రజాస్వామ్యానికే భంగం కలిగేలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను EC విడుదల చేయవచ్చా..? అని ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్రమోడి నాయకత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలు లేవు…కానీ ఇక్కడ మాత్రం ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని నిలదీశారు. కేంద్ర కేబినెట్ సమావేశాలు చేస్తున్నారు..నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలను పని చేయనివ్వకుండా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారాయన. ఒక్క బిజెపియేతర ప్రభుత్వాలకే ఎన్నికల సంఘం ఆంక్షలా..? కేంద్రంలో ఎక్కడా కేబినెట్ సెక్రటరీ జోక్యం చేసుకోవడం లేదు..కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈసీ నియమించిన సిఎస్ జోక్యం చేసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.
బిజేపియేతర ప్రభుత్వాలలో ఈసీ నియమించిన సీఎస్‌ల జోక్యాన్ని ఎలా చూడాలి..? రాజ్యాంగానికి ఎన్నికల సంఘం అతీతంగా భావిస్తున్నారా..? ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ చేయమని ఈసి పేర్కొంటే వీళ్లు చేస్తున్నదేమిటి..? అంటూ ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న వ్యక్తికాదని తెలిపిన యనమల..ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ అని చెప్పారు. స్టాప్ గ్యాప్ అరేంజ్ మెంట్ లో నియామకం జరిగినట్లు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే ప్రస్తుత సీఎస్ పరిమితమ్నారు. కానీ పరిధి దాటి సీఎస్ వ్యవహరించడాన్ని ఎలా చూడాలి..? వాస్తవానికి ఆపద్దర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాధారణ పాలన చేయవచ్చని..కానీ ఇప్పుడున్నది ఆపద్దర్మ ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వమన్నారు యనమల.
ఫణి తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకువస్తోంది అంటున్నారు. ఈ తుఫాన్ రాష్ట్రానికి నష్టం చేస్తే ఎవరు బాధ్యులు..? ప్రధాన కార్యదర్శి బాధ్యత వహిస్తారా..? ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా..? లేక నరేంద్రమోడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా..? అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం.. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపైనే ఉందన్నారు. అలాంటిది పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేయకూడదనడం విడ్డూరమని విమర్శించారు. పనులు సమీక్షించకపోతే సకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తికావని..జాప్యం జరిగితే పెరిగే అంచనా వ్యయానికి బాధ్యత ఎవరిదన్నారు.
ఈ సీజన్ కూడా కోల్పోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు..? గవర్నమెంట్ లేకుండా గవర్నెన్స్ ఉంటుందా..? ప్రభుత్వం లేకుండా పరిపాలన ఉంటుందా..? ఆ విధంగా రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా.? సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ లో ఉందా..? అని తెలిపారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమా..? ఈసి నియమించిన ప్రధాన కార్యదర్శా..? ఈ విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే పరిస్థితి ఏమిటి..? ఎవరైనా దీనిపై కోర్టులను ఆశ్రయిస్తే ఏమిటి పరిస్థితి..? ఆయనకున్న విధులు వేరు, ఆయన చేస్తున్న విధులు వేరు అన్నట్లుగా అందులో వ్యాఖ్యలే చెబుతున్నాయన్నారు. ఫలితాల గురించి, ప్రజా తీర్పు గురించి ఆయన ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు..? దీనిపై సీఎస్ సుబ్రమణ్యం క్లారిఫై చేయాల్సివుందని డిమాండ్ చేశారు. బిజేపియేతర ప్రభుత్వాలపై ప్రధాని మోడి వివక్షతకు ఇది పరాకాష్ట..బీజేయేతర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని..దీనికి ఆ పార్టీ మూల్యం చెల్లంచుకోక తప్పదని ఘాటుగా యనమల హెచ్చరించారు.