వైయస్‌ఆర్‌ కంటి వెలుగు: 5.40 కోట్ల మందికి ఉపయోగం

  • Published By: vamsi ,Published On : October 10, 2019 / 08:42 AM IST
వైయస్‌ఆర్‌ కంటి వెలుగు: 5.40 కోట్ల మందికి ఉపయోగం

Updated On : October 10, 2019 / 8:42 AM IST

అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినవైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి దశలో 70లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. కంటి వెలుగు పథకంపై ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యాకర్తలకు అధికారులు శిక్షణ ఇచ్చారు.

నవంబర్, డిసెంబర్ నెలల్లో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారు. ఈ పథకం ద్వారా అవసరమైన వారికి కళ్లద్దాలు, వైద్య సదుపాయాలు అందించనుంది ప్రభుత్వం. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రం మొత్తం కంటివెలుగు పథకం అమల్లోకి రాబోతుంది. అంధత్వ నివారణ లక్ష్యంగా ‘కంటి వెలుగు’ పథకం అమలులోకి రాబోతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

ప్రజా ఆరోగ్యంలో విప్లవాత్మకమైన వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంను అనంతపురం జిల్లాలో వైయస్‌ జగన్‌ ఈ పథకం ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడనుంది. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.4కోట్ల మందికి నేత్ర పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.

తొలి దశలో అక్టోబర్ 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారు.