6 నెలల బోసినవ్వుల బుడ్డోడు..వాటర్ స్కీయింగ్ సాహసం

6 నెలల వయస్సు పసివాడు ఏం చేస్తాడు?బొజ్జనిండా అమ్మ పాలు తాగి…హాయిగా బజ్జుంటాడు. కానీ బోసినవ్వులతో ఇల్లంతా నవ్వులు చిందించే ఆరు నెలల ఓ చిచ్చరపిడుగులాంటి ఓ పిల్లాడు మాత్రం ఏకంగా ఓ సాహసం చేసి ఔరా..అనిపించాడు. ఆరు నెలలంటే నిలబడటం కూడా రాదు..కానీ అమెరికాలోని ఓ ఆరు నెలల పిల్లాడు మాత్రం ఏకంగా వాటర్ స్కీయింగ్ సాహసం చేసి ఔరా అనిపించాడు. ప్రపంచంలో అత్యంత చిన్న వయస్సులో వాటర్ స్కీయింగ్ చేసి రికార్డు సృష్టించాడు.ఈ అడ్వేంచర్ బుడ్డోడి పేరు ‘రిచ్ క్యాసీ హంఫరీస్’.
క్యాసీ, మిండి హంఫరీస్ అనే ఓ జంట గారాల పట్టి ఈ రిచ్ క్యాసీ హంఫరీస్. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఆరు నెలల పసివాడు ఉటాలోని లేక్ పావెల్‌లోని సరస్సులో స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. కొడుకు రిచ్ క్యాసీ హంఫరీస్ 6 నెలల వయస్సులో ప్రపంచ రికార్డును నెలకొలిపాడని తెలిపారు. రిచ్ వాటర్ స్కీయింగ్ చేస్తున్న ఫొటో, వీడియోను పోస్టు చేశారు.
పింక్ కలర్ లో మెరిసిపోతున్న ఈ 6 నెలల బుడ్డోడు రిచ్ లైఫ్ జాకెట్ వేసుకుని.. స్కియింగ్ బార్స్‌ను పట్టుకుని ఎంతో ధైర్యంగా నీటిపై దూసుకెళ్తూ కనిపించాడు. అతడి పక్కనే బోటులో ప్రయాణిస్తున్న తండ్రి ఆ పిల్లాడు భయపడకుండా మాటల్లో పెట్టడంతో ఆ పిల్లాడు ఏమీ భయపడలేదు.
కాగా..ఇప్పటివరకు ఈ రికార్డు జైలా ఓంగే పేరుపై నమోదై ఉంది. 2016లో ఆరు నెలల 27 రోజుల వయస్సులో ఈ సాహసం చేసి.. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో వాటర్ స్కీయింగ్ చేసిన పసివాడుగా గుర్తింపు పొందాడు. రిచ్.. 6 నెలల 4 రోజులోనే ఈ సాహసం చేయడం గమనార్హం.