వాట్ ఏ మిరాకిల్…కారు గుద్దగానే పోయిన కంటి చూపు తిరిగొచ్చింది

సాధారణంగా సినిమాలు, సీరియల్ లో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి గతం మరిచిపోతే.. మళ్లీ అలాంటి ప్రమాదమే జరిగితే అన్నీ గుర్తొచ్చేస్తాయని డాక్టర్లు చెప్పడం వినుంటారు. అయితే అది ఓ వ్యక్తి జీవితంలో నిజమైంది. ఈ అద్భుతమైన సంఘటన నిజంగానే జరిగింది. గోర్జో విల్కోపోల్స్కి నగరంలో నివసిస్తున్న జానుస్జ్ గోరాజ్ అనే వ్యక్తికి 20 ఏళ్ల కిందట ఎడమ కన్ను పూర్తిగా చూపు కోల్పోయి కుడి కన్ను మాత్రమే కనిపించేది. అయితే దీనికి ట్రీట్మెంట్ కూడా కుదరదని డాక్టర్లు అప్పుడే వారికి చెప్పేశారు. దీంతో గోరాజ్ అంధుడిలాగానే జీవిస్తున్నాడు.
అలా.. గడిచిపోతున్న అతడి జీవితంలో 2018 వెలుగులు నింపింది. జరిగింది ప్రమాదమే, కానీ.. అతడికి మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేసిన తీపి ఘటన. ఓ రోజు అతడు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అతడిని ఢీకొట్టింది. అనంతరం గాల్లోకి ఎగిరి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తుంటి భాగం విరగడంతో అతడు హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. వైద్యులు సర్జరీ చేసి అతడి తుంటికి చికిత్స అందించారు.
అయితే, ఓ రోజు ఉదయం కళ్లు తెరవగానే.. ఎదురుగా ఉన్న వస్తువులు, మనుషులు స్పష్టంగా కనిపించారు. అది నిజమని తెలియక అతడు కాసేపు గందరగోళానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అంటూ ఆశ్చర్యపోయారు.
డాక్టర్లు మాట్లాడుతూ.. మేము యాక్సిడెంట్ తర్వాత కొన్నిరకాల మందులను ఇచ్చాం. వాటిలో ఏ మందు పనిచేసిందో తెలీదుగానీ.. అది అతడి కంటి లోపాన్ని సరిచేసి ఉండవచ్చు. ఆ సమయంలో అతడికి రక్తం గడ్డకుండా ఇచ్చే యాంటికాగ్యులంట్స్ ఇచ్చాం. వాటి వల్ల అతడి చూపు మెరుగుపడి ఉండవచ్చు అని తెలిపారు.
గోరాజ్ మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొబైల్ లోని అక్షరాలను కూడా చదువగలుగుతున్నా. మళ్లీ చూపు ఎలా వచ్చిందనేది వైద్యులు నాకు చెప్పలేదు. ఆ యాక్సిడెంట్ తో నా జీవితం మారిపోయింది అని తెలిపాడు. ఇంక్కో విచిత్రమేంటంటే.. నేను ఏ హాస్పిటల్ లో కంటి చూపును తిరిగి పొందానో అక్కడే ఉద్యోగాన్ని సంపాదించాను. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాను అని తెలిపారు.