తప్పు తెలుసుకున్నాడు, లొంగిపోయాడు.. తీవ్రవాది మనసు మార్చిన జవాన్లు, సైనికుల పాదాలు తాకిన యువకుడి తండ్రి

terrorist in J&K surrenders: తెలిసో తెలీకో ఆ యువకుడు ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడు అయ్యాడు. ఉగ్రవాదిగా మారాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న అతడు లొంగిపోయాడు. అయితే అతడిలో ఈ మార్పు రావడానికి కారనం మాత్రం జవాన్లే. అవును సైనికులు ఆ తీవ్రవాది మనసు మార్చారు. అతడిలో మార్పు తెచ్చారు. జవాన్ల మాటలు విన్న ఆ యువకుడు తుపాకీ వదిలేసి ఇంటిబాట పట్టాడు.
ఉగ్రవాది మనసు మార్చిన జవాన్లు:
ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడు అయిన యువకుడికి, తాను చేసిన తప్పును తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. టెర్రరిస్టులు జరిపే రక్తపాతంలో అతడు ఇమడలేకపోయాడు. పైగా తన కోసం విలపిస్తున్న తండ్రిని చూపి కరిగిపోయాడు. అంతేకాదు ‘నీకేం కాదు మా వద్దకు రా’ అని పిలుస్తున్న జవాన్లు అతనికి సొంత సోదరుల్లా కనిపించారు. అంతే, అతడిలో మార్పు వచ్చింది. వీటన్నింటి ముందు తన దగ్గరున్న ఏకే-47 శక్తిమంతమైందేం కాదనిపించింది. వెంటనే దాన్ని పక్కన పడేశాడు. లొంగిపోయాడు. తండ్రితో కలిసి ఆనందంగా ఇంటికి పయనమయ్యాడు. ఈ భావోద్వేగ ఘటన జమ్మూ-కశ్మీర్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియోను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి.
నిన్నెవరూ కాల్చరు, లొంగిపో:
అక్టోబర్ 13న ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్‌పీవో) రెండు ఏకే-47 తుపాకులతో కనిపించకుండాపోయాడు. అదే రోజు చదూర ప్రాంతంలో జహంగీర్ భట్ అనే యువకుడూ ఆచూకీ లేకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం వాళ్ల కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం జరిపిన ఓ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతడు జహంగీరే అని జవాన్లు గుర్తించారు. అతడి తండ్రిని ఎన్‌కౌంటర్ జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చారు. లొంగిపోవాలని ఆయనతో చెప్పించారు. భయంతో వణుకుతూ తోటలో ఓ పొదల చాటున దాక్కున్న జహంగీర్‌కు తండ్రి మాట విని ప్రాణం లేచి వచ్చింది. ‘దేవుడి మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం నీకేం కాదు. నిన్నెవరూ కాల్చరు. వచ్చి లొంగిపో’ అని జవాన్ ఇచ్చిన హామీపై నమ్మకం కలిగింది. తుపాకీని పక్కనబెట్టి..చేతులు పైకెత్తి.. నెమ్మదిగా జవాన్ల వద్దకు చేరుకున్నాడు.
తాగడానికి నీళ్లిచ్చి ధైర్యం చెప్పిన సైనికులు:
అలా వచ్చిన అతనికి తాగడానికి నీళ్లిచ్చి సైనికులు ధైర్యం చెప్పారు. తప్పులు జరుగుతుంటాయి..నీకు ఏమీ కాదని భరోసా కల్పించారు. తన కొడుకును ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడినందుకు జహంగీర్ తండ్రి జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. అతనికీ ధైర్యం చెప్పిన సైనికులు ఇంకెప్పుడు తన కొడుకు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని సూచించారు.
#ChinarCorps #AwaamKeLiye
One SPO went missing with two AK-47 on 13 Oct 20.Same day Jahangir Bhat from Chadoora had gone missing .Today he was apprehended with one AK rifle.kudos to soldiers of @ChinarcorpsIA for handling the situation professionally @NorthernComd_IA pic.twitter.com/r0mVooR0f4— Southern Command INDIAN ARMY (@IaSouthern) October 16, 2020