సుశాంత్ సూసైడ్ కేసులో కొత్త కొత్త ఛాలెంజ్‌లు.. రియా సోదరుడికి 886 ఫోన్ కాల్స్!

సుశాంత్ సూసైడ్ కేసు రోజుకొక మలుపుతో క్రైమ్ స్టొరీని తలపిస్తుంది. మృతి వెనుక కారణాలు వెతికే పనిలో ఉన్న పోలీసులకి కొత్త కొత్త చాలెంజ్ లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుని ముంబై, పాట్నా పోలీసులు విచారిస్తుండగా.. మరోవైపు ఈడీ, సీబీఐ కూడా కీలక విషయాలు రాబడుతోంది. సుశాంత్ ఆత్మహత్యలో రియా చక్రవర్తి పాత్ర గురించి అధికారులు కూపీ లాగుతున్నారు. ఏడాదికాలంగా ఆమె ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై క్షుణ్ణంగా ఆరాతీస్తున్నారు. సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీకి 808 సార్లు, తన సోదరుడు శోవిక్ చక్రవర్తితో 886 సార్లు.. మహేశ్‌భట్‌కు 16 సార్లు కాల్ చేసినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సీబీఐ, ఈడీ సేకరిస్తోంది. అలాగే ఆర్థిక లావాదేవీలపై కూడా దృష్టిసారించారు.
బిహార్ పోలీసులతో సీబీఐ సంప్రదింపులు :
కేంద్రం ఆదేశాలతో సుశాంత్ సుసైడ్ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండ, శృతి మోదీ, మరికొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. సుశాంత్ మృతి కేసులో తొలి ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసిన బిహార్ పోలీసులతో సీబీఐ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని త్వరలోనే తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది.
2019నుంచి సుశాంత్‌తోనే ఉంటున్న సిద్దార్థ్
సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానికి బెదిరింపు కాల్స్ రావడం ఈ కేసులో మరో ట్విస్ట్. రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్నది ఆ బెదిరింపు కాల్స్ సారాంశం. దీంతో మెయిల్ ద్వారా ముంబై బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిద్దార్థ్. సినిమాలపై మోజుతో జైపూర్ లో ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిద్ధార్థ్ ప్రతిభను సుశాంత్ గుర్తించాడు. అతడిలో మంచి టాలెంట్ ఉందని గ్రహించి తన టీమ్ మెంబర్‌గా అవకాశం ఇచ్చాడు. 2019 నుంచి పితాని సిద్ధార్థ్ హీరో సుశాంత్ తో పాటు అతడి ఇంట్లోనే ఉంటున్నాడు.
ఆత్మహత్యకు ముందు రోజు కూడా సుశాంత్‌తోనే ఉన్నాడు సిద్ధార్థ్. అయితే సుశాంత్-రియాల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉందని తనకు తెలియదనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తారో తెలియదంటున్న సిద్ధార్థ్.. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెబుతున్నాడు. సూసైడ్ మిస్టరీలో పోలీసులే నిజాలు తేలుస్తారని అంటున్నాడు.
రియా అఙ్ఞాతం వెనుక రీజనేంటి? :
రియాపై అనుమానం వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే ఈ కేసులో ఇన్ని మలుపులు ఉండేవి కావోమో. కానీ జరుగుతున్న పరిణామాలు అందర్నీ షాక్‌కి గురిచేస్తున్నాయి. ఇన్నాళ్లు సుశాంత్‌తో సహజీవనం చేసిన రియా అతను చనిపోయాడని తెలియగానే ఎందుకు అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిందన్నది అంతుపట్టకుండా మారింది. అందరి చూపు ఆమె వైపునకే వెళ్తున్నా.. తాను మాత్రం సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌లో కౌంటర్లు ఇస్తుంది.
తాను నిరపరాధినని ఎప్పటికైనా ట్రూత్స్ విన్ అవుతాయని అంటోంది. నిజంగా తనకేం సంబంధం లేకుంటే సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో నగదు ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసిందన్నది మిస్టరీగా మారింది. సుశాంత్ తల్లిదండ్రులు ఆ అకౌంట్లు రియా కుటుంబసభ్యులవేనని ఆరోపిస్తున్నప్పటికీ అందులో క్లారిటీ లేదు. ఎవరో అఙ్ఞాత వ్యక్తుల ఖాతాలోకి ఆ డబ్బు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈడీ, సీబీఐ ఎంట్రీతో మొత్తం వాస్తవాలు బయటకు వచ్చే అవకాశముంది.
AIEEEలో ఆల్ ఇండియా లెవెల్లో సెవెన్త్ ర్యాంక్ :
ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు చెప్పే సుశాంత్ ఎందుకు చనిపోవాలని అనుకున్నాడు? నిజానికి సినిమాల్లోకి రావాలని ఎప్పుడు సుశాంత్ కలలు కనలేదు. సినిమానే తనను ఇటువైపు లాక్కొచ్చింది. చదువులో డిస్టింక్షన్ క్యాండెట్. AIEEEలో ఆల్ ఇండియా సెవెన్త్ ర్యాంక్ అంటే సుశాంత్‌కి చదువంటే ఎంతో ఆసక్తి వేరే చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో ఇంజనీరింగ్ కాలేజిలో చేరిన సుశాంత్ 2005లో ఓ ఫిల్మ్ వేడుకలో డాన్సర్‌గా పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండానే బాలాజీ టెలీఫిల్మ్స్ లో సీరియల్ యాక్టర్‌గా మారాడు. మూడేళ్ల పాటు అందులోనే పనిచేశాడు. 2013లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కే పో చే, పీకే, ఈజ్, కేధార్‌నాథ్, చిచోరే సినిమాల్లో హీరోగా నటించి శభాష్ అనిపించుకున్నాడు.
ఎంఎస్ ధోనితో సుశాంత్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత పరాజయాలు పలకరించినా పెద్దగా ఇబ్బంది పడలేదు. మళ్లీ మంచి రోజులు వస్తాయనే ధీమాతోనే ఉండేవాడు. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు. సుశాంత్ జీవితం విషాదాంతమైంది. ముంబై, పాట్నా పోలీసులు విచారణ జరుపుతున్నా సుశాంత్ ఆత్మహత్య వెనుక అసలైన కారణాలను వెల్లడించలేదు. ఇక ఈడీ, సీఐడీలు విచారణ ముమ్మరం చేయడంతో త్వరలోనే సూసైడ్ మిస్టరీ వెనుకున్న నిజాలు బయటకు వస్తాయని సుశాంత్ కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.