Alleti Maheshwar Reddy: మ్యాచ్ ఫిక్సింగ్‌లా ఉంది.. రాత్రి సభ ఎందుకు? కేసీఆర్ అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ- కాళేశ్వరం రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది.

Alleti Maheshwar Reddy: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు.. మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందన్నారు. కమిషన్ తన నివేదికలో ఎక్కడా కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ఎందుకంత ప్రేమ? అని నిలదీశారు. 650 పేజీల నివేదిక ఇచ్చి.. రాత్రి సభ ఎందుకు పెట్టారు అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. అసలు ఆదివారం సభ పెట్టడానికి కారణం ఏంటో చెప్పాలన్నారు.
”కాంగ్రెస్, బీఆర్ఎస్ కంబైన్డ్ క్రియేషన్స్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది. ఎక్కడా ఈ కమిషన్ కు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపించడం లేదు. కమిషన్ కు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఎక్కడా కూడా కరెప్షన్ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పినట్లుగా లేదు. కరెప్షన్ ప్రాక్టీసస్ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేయాలనే చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టమవుతోంది. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది. కేవలం ఐ వాచ్ కోసం కమిషన్ వేశారు.
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది. ఇందులో కేసీఆర్, హరీశ్ రావు అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడమే అందుకు నిదర్శనం. అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఈ కమిషన్? అసలు ఈ కమిషన్ దేనికోసం వేశారు? ఆదివారం సభ పెట్టడానికి కారణం ఏంటి? 650 పేజీల రిపోర్ట్ ఇచ్చి.. రాత్రి సభ ఎందుకు పెట్టారు?” అని రేవంత్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
Also Read: నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు..! అందుకే అలా చేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్