Weather Updates: మరో అల్పపీడనం..! ఏపీలో భారీ వర్షాలు.. మరో 4 రోజులు వానలే వానలు..
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించారు.
Weather Updates: ఏపీని వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వానలు దంచికొడుతున్నాయి. నాన్ స్టాప్ వర్షాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది.
రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. దీనికి తోడు.. మరో 4 రోజులు వానలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలర్ట్ అయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రేపు మరో అల్పపీడనం..!
ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టర్లకు అందిచాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులకు ఆదేశించారు. మండల కంట్రోల్ రూమ్స్ లో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖ అధికారులను ఉంచాలని.. తద్వారా సమస్యలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ వారం రోజులు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ గా ఉండాలన్నారు. ఎక్కడైనా గండ్లు పడే ఛాన్స్ ఉందనుకుంటే ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ప్రమాదకర పరిస్థితులు రాకముందే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రాణాలు, ఆస్తులు, పంటలు, నీటిపారుదల నిర్మాణాల భద్రత కోసం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా పని చేయాలని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. రిజర్వాయర్స్, చెరువులు, బ్యారేజీలు, వాగులు అన్నింటిపై రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ చేయాలన్నారు.
గంట గంటకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను కంట్రోల్ రూమ్ కి పంపాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ, పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత వరకు నష్టాలను నివారించాలన్నారు. నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే లోతట్టు గ్రామాలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇసుక బస్తాలు, మోటర్లు, బొట్లు, జనరేటర్లు వంటి అత్యవసర సామాగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. గ్రౌండ్ లెవెల్ లో గండ్లు పడే అవకాశం ఉంటే ఫోటోలు, వీడియోల ద్వారా రిపోర్ట్ పంపాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రావులపాలెంలో 92.2 మిమీ, ముమ్మిడివరంలో 90.7 మిమీ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5 మిమీ, కోనసీమ జిల్లా గంగవరంలో 83.7 మిమీ, ముక్కామలలో 79.7 మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్ లో 78.5 మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 76.2 మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు.
Also Read: లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?
