Lok Sabha Elections-2024: లోక్‌సభ ఎన్నికల్లో మా గెలుపు అవకాశాలు పెరిగాయి: చిదంబరం
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చిదంబరం మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు కూడా పోరాడతాయని చెప్పారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎవరి సలహాలు అవసరం లేదని తెలిపారు.

P Chidambaram
Lok Sabha Elections-2024: ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలను పెంచుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీనే బీజేపీ ప్రధాన లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
“దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో మీడియా స్వేచ్ఛను హరిస్తారు. ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు దేశంలో ఏమీ లేవు. జర్నలిస్టులు, మీడియా స్వేచ్ఛను అణిచివేసే ధోరణి కొనసాగుతోంది. బీజేపీ ప్రధాన లక్ష్యం కాంగ్రెస్. మా పార్టీని ఎన్నికల నుంచి దూరం చేస్తే ప్రాంతీయ పార్టీలను సులభంగా ఎదుర్కోవచ్చని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తప్పుగా అంచనాలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయలేరు.
ప్రాంతీయ పార్టీలు కూడా పోరాడతాయి. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎవరి సలహాలు అవసరం లేదు. నేను కూడా ఆయనకు ఎలాంటి సలహానూ ఇవ్వబోను. రాహుల్ చాలా ధైర్యవంతుడు. భారత్ జోడో యాత్రలో తన సంకల్పశక్తిని ఆయన ప్రదర్శించారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరస్పరం అవగాహనకు రావడం వల్ల విపక్షాల ఐక్యత సాధ్యం అవుతుంది. ? సమాఖ్య నిర్మాణంలో ప్రాంతీయ పార్టీలు భాగం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాను” అని చిదంబరం చెప్పారు.