Chandrayaan 3: చంద్రుడిపై మాకు ఆ హక్కు ఉంది.. ఇతర దేశాలూ పేర్లు పెట్టుకున్నాయి: ఇస్రో ఛైర్మన్

రోవర్ తీసిన ఫొటోలు ఇస్రో స్టేషన్లకు చేరడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. అందుకే తాము..

Chandrayaan 3: చంద్రుడిపై మాకు ఆ హక్కు ఉంది.. ఇతర దేశాలూ పేర్లు పెట్టుకున్నాయి: ఇస్రో ఛైర్మన్

Chandrayaan 3

Chandrayaan 3 – S Somanath: జాబిల్లిపై ప్రజ్ఞాన్ రోవర్ (Rover) చక్కర్లు కొడుతూ భారత ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాపింపజేస్తున్న వేళ ఓ వివాదం రాజుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శివశక్తి పాయింట్ (Shiv Shakti Point) చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోందని, జాబిల్లి దక్షిణ ధ్రువంలోని రహస్యాలను అన్వేషిస్తోందని తాజాగా ఇస్రో (ISRO) ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో ఆ పేరు పెట్టింది. అయితే, శివశక్తి అని పేరు పెట్టడంపై ఏవైనా వాదనలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై ఇవాళ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు.

తిరువనంతపురంలో ఓ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రుడిపై ల్యాండింగ్ ప్లేస్‌కు శివశక్తి పేరును పెట్టడం విషయంపై ఎలాంటి వివాదమూ లేదని అన్నారు. ఆ ప్రదేశానికి పేరు పెట్టే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. శాస్త్ర విజ్ఞానం, నమ్మకం అనేవి రెండు ప్రత్యేక అంశాలని, ఆ రెండింటినీ కలిపి చూసే అవసరం లేదని అన్నారు.

ఇతర దేశాలు కూడా చంద్రుడిపై పేర్లు పెట్టుకున్నాయని, ఇది ఆయా దేశాలకు ఉన్న విశేషాధికారమని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశం భారత్ అని ఆయన గుర్తుచేశారు. అక్కడ ఉండే కొండలు, లోయల వల్ల పరిశోధనలు చాలా క్లిష్టతరమని చెప్పారు.

చిన్న లోపం తలెత్తినా మిషన్ విఫలం అవుతుందని అన్నారు. రోవర్ తీసిన ఫొటోలు ఇస్రో స్టేషన్లకు చేరడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. అందుకే తాము ఈ విషయంలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల గ్రౌండ్ స్టేషన్ల మద్దతు కోరామని చెప్పారు. సూర్యుడి గురించి పరిశోధనలకు ఉద్దేశించిన మిషన్ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతామన్న విషయంపై త్వరలోనే తేదీ ప్రకటిస్తామని అన్నారు.

Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. వేగంగా కదిలితే ఏమవుతుందో తెలుసా?