ఎన్నికల సిబ్బందిపై సీఈవో సీరియస్

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 03:54 AM IST
ఎన్నికల సిబ్బందిపై సీఈవో సీరియస్

గుంటూరు : ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీరియస్ అయ్యారు. ఎన్నికల సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ తీరు సరిగా లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి నిరీక్షణ తప్పలేదు. పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయింపుతో ఆయన కాసేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అని నిలదీశారు. పలు పోలింగ్ బూత్ లలో హడావుడి ఉండటంపైనా ద్వివేదీ సీరియస్ అయ్యారు.

ఏపీలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. వందల చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కూడా ప్రారంభం కాలేదు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు.. ఈవీఎంలు మొరాయించడంతో అసహనం చెందుతున్నారు. కొంతమంది ఓటు వెయ్యకుండానే పోలింగ్ బూత్ ల నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు.

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఈసీ అనుమతిచ్చింది. గురువారం(ఏప్రిల్ 11,2019) 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2వేల 118 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభ బరిలో 319 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.