బాబు కసరత్తు : కౌలురైతులకు సాయం!

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 02:45 AM IST
బాబు కసరత్తు : కౌలురైతులకు సాయం!

విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పలు చర్యలు తీసుకోవాలని బాబు రెడీ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇచ్చింది. ఇక్కడ కౌలు రైతులకు మాత్రం ఇవ్వలేదు. అయితే..కౌలు రైతులకు కూడా సాయం కల్పించాలని బాబు నిర్ణయించారు. ఖరీఫ్..రబీ సీజన్లలో ఎకరానికి రూ. 2500 చొప్పున రైతులకు విడివిడిగా సాయం చేయాలని బాబు నిర్ణయించినట్లు టాక్. 

రైతు రక్ష లేదా ఏరువాక పేరు పెట్టి ఈ పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఎకరానికి రూ. 2500 చొప్పున ప్రభుత్వం సాగు సాయం కింద ఇచ్చే మొత్తం ఒక సీజన్‌కు రూ. 4వేల కోట్లుగా ఉండబోతోందని అంచనా. ఒక ఎకరానికి ఇచ్చే మొత్తంలో కౌలుదారుకు రూ. 1500, భూ యజమానికి రూ. 1,000 చొప్పున ఇస్తారు. ఇక్కడ కౌలు రైతుకు సంబంధించిన కరెక్టు సమాచారం గవర్నమెంట్ వద్ద లేదు. కౌలు రైతులు సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. వీరికి కౌలుదారుల గుర్తింపు ఉంది. ఇంకా పెద్ద సంఖ్యలో కౌలు రైతులున్నా…వారికి గుర్తింపు లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతానికి కౌలు రైతులకే ఈ సాయాన్ని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 

జూన్ మాసంలో ఖరీఫ్ సాగు వస్తుంది ఈ సమయంలో సాయాన్ని అందచేయాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఇప్పుడు ఈ సాయం చేస్తే వేరేవాటికి ఖర్చు చేసే అవకాశం ఉందని..కొద్దిగా లేటుగా ఇస్తే..ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి చెక్ పెట్టాలంటే పోస్టు డేటెడ్ చెక్కులు ఇస్తే సులువుగా ఉంటుందని…కోడ్ అమల్లోకి వచ్చేలోపు ఈ చెక్కులను రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉంది.