10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 02:07 PM IST
10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు. 3 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేస్తున్న కథనాలను ఆపేందుకు కొందరు ప్రయత్నించినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి చెప్పారు. వారు ఎవరో, అక్రమాల్లో వారి పాత్ర ఏంటన్నది విచారణలో తేలుతుందన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలకు అడ్డాగా మారింది. భారీ స్థాయిలో అవినీతి జరుగుతోంది. ల్యాప్ టాప్ లు, దుస్తుల కొనుగోళ్లలో కరప్షన్ జరిగింది. ఫిల్టర్ బెడ్స్, వాటర్ ప్లాంట్స్ నిర్వహణలోనూ అవినీతి జరిగింది. బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవినీతిని 10 టీవీ వెలుగులోకి తెచ్చింది. అక్రమార్కుల నిజస్వరూపాన్ని కెమెరా సాక్షిగా బయటపెట్టింది. అవినీతి కాంట్రాక్టర్ అసలు రూపాన్ని ముసుగు తీసి చూపించింది. కాంట్రాక్టర్ కొండా సంతోష్ మాత్రమే కాదు.. అతడికి సహకరించిన వారిని కూడా ప్రజల ముందు ఉంచింది.

బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాల లెక్కలపై… కాంట్రాక్టుల కహానీపై అవినీతి అడ్డా పేరుతో 10 టీవీ కథనాలు ప్రసారం చేయడంతో అక్రమార్కుల కాళ్ల కింది భూమి కదిలిపోయింది. చదువుల నిలయంలో సాగుతున్న అవినీతి కంపుపై వేసిన స్టోరీలు వారికి నిద్ర లేకుండా చేశాయి. అక్రమాలు, అవినీతితో చెలరేగిపోయిన వారు… తమ బాగోతం బయటపడకుండా ఉండేందుకు అడ్డదారిని వెతికారు. కథనాలు ప్రసారం కాకుండా అడ్డుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరలేపి.. టెన్‌ టీవీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు.