మద్యం నియంత్రణలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 01:17 PM IST
మద్యం నియంత్రణలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. మద్యం నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారాయన. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం (నవంబర్ 7, 2019) క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు సేకరించి.. విశ్లేషణ చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా బార్ల సంఖ్య తగ్గింపును జనవరి 1 వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సూచించారు. బార్లకు అనుమతిచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

బడి, గుడి, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇళ్ల మధ్య బార్లకు అనుమతి ఇవ్వరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. బార్ల ఏర్పాటు తర్వాత స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలని కూడా సూచించారు సీఎం జగన్. బార్ల సమయ వేళలను కూడా విధిగా పాటించాల్సిన అవసరం ఉందని.. అర్థరాత్రి వరకు తెలిచి ఉంచకుండా ఎప్పటికప్పుడు మానటరింగ్ చేయాలని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటలు దాటితే మందు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు సీఎం జగన్.