గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య

విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 01:46 AM IST
గోదావరి బోటు ప్రమాదం : 11కి చేరిన మృతుల సంఖ్య

విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.

రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు దగ్గర గోదావరి అత్యంత లోతైన ప్రాంతం. ఇక్కడ నది కేవలం 300 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. పైగా సుడులు తిరుగుతూ ప్రమాదకరంగా ఉంటుంది. దీంతో ఏ బోటు అయినా తూటికుంట వైపునుంచే ముందుకు వెళుతుంది. కానీ పర్యాటకుల బోటు కచ్చులూరు వైపుగా వెళ్లటంతో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో బోటు ముందుకు వెళ్లడం కష్టమైంది. ఇంజిన్ వేగాన్ని కూడా పెంచటంతో స్టీరింగ్ కు ఉన్న తీగతెగిపోయింది. ఆ తర్వాత ఇంజిన్ కూడా ఆగిపోయింది. సుడులు అధికంగా ఉండటం వల్ల ఒక్కసారిగా బోటు మునిగి పైకి లేచి అంతలోనే మళ్లీ మునిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు మృతి చెందారు. 27మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఓఎన్ జీసీ, నేవీకి చెందిన హెలికాప్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన ప్రత్యేక బృందాలతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర బోటు మునిగింది. 61 మంది పర్యాటకులు, 10మంది సిబ్బందితో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గోదావరిలో 2 నెలలుగా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పర్యాటక బోట్ల రాకపోకలపై నిషేధం విధించారు. తాజాగా వరద ప్రవాహం తగ్గడంతో పర్యాటక బోట్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. పోలవరం పరిధిలోని కాఫర్ డ్యామ్ నుంచి పాపికొండల వరకు గోదావరి ప్రమాదకరంగా ఉంది. సుడులు అధికంగా ఉన్నాయి. సాధారణంగా బోటునడిపే వారికి వడి, సుడి జాడలు తెలుస్తాయి. వరదలు, ఇతర పర్యావరణ కారణాల వల్ల గోదావరి దశ దిశల్లో తేడాలుంటే బోటు డ్రైవర్లు ఇట్టే గుర్తిస్తారని చెబుతున్నారు. రాయల్ వశిష్ఠ బోటును స్థానికేతరులైన నూకరాజు, తామరాజు అనే డ్రైవర్లు నడిపారు. ఈ మార్గానికి ఇద్దరూ కొత్తవారు కావటంతో అవగాహన లేక దారుణం జరిగిపోయిందని చెబుతున్నారు. రాయల్ వశిష్ట బోటుని 2016 నుంచి తిప్పుతున్నారు.