కొండవీడులో హైటెన్షన్ : రైతు కోటయ్య మృతిపై రాజకీయ దుమారం

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 09:39 AM IST
కొండవీడులో హైటెన్షన్ : రైతు కోటయ్య మృతిపై రాజకీయ దుమారం

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నిమిత్తం పంటను నాశనం చేస్తున్న పోలీసులను కోటయ్య అడ్డుకున్నాడని..దీనితో వారు లాఠీలతో బాదడంతోనే కోటయ్య మృతి చెందాడని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఖండిస్తోంది. రైతు కోటయ్యను ఓ కానిస్టేబుల్ భుజాన వేసుకుని వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న కోటయ్యను రక్షించడానికి తాము ప్రయత్నించామని పోలీసులు పేర్కొంటున్నారు. 

అసలే జరిగింది : – 
ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సీఎం చంద్రబాబు కొండవీడులో పర్యటించారు. యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు కోటయ్యకు చెందిన పంట పొలాల్లో పోలీసులు టెంట్లు వేసుకున్నట్లు..పంట నాశనం కావడంతో అడ్డుకున్న కోటయ్యను లాఠీలతో బాదినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రైతు అక్కడికక్కడనే మృతి చెందినట్లు తెలుస్తోంది. అతను చనిపోయాడనే విషయం దావానంలా వ్యాపించడంతో పొలిటికల్ పార్టీలు స్పందించాయి. ఘటనకు అధికారపక్షమే కారణమని..పోలీసులు కొట్టడంతోనే రైతు కోటయ్య మృతి చెందాడంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. కుటుంబ కలహాలతోనే కోటయ్య పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ : – 
ఇదిలా ఉంటే కోటయ్య మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజ నిర్దారణ కమిటీ వేసింది. రైతు కోటయ్య కుటుంబాన్నిపరామర్శించేందుకు ఫిబ్రవరి 20వ తేదీన కొత్తపాలెం గ్రామానికి కమిటీ వచ్చింది. ముందే తెలుసుకున్న పోలీసులు కమిటీ మెంబర్స్‌ని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనాలు దిగి కమిటీ సభ్యులు నడుచుకుంటూ వెళ్లారు. 

జగన్ ట్వీట్ : – 
కొండవీడులో రైతు కోటయ్య మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘కొండవీడులో ఒక బీసీ (ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ. కొట్టి కొన ఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ? ’ అంటూ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.