కల్కి కథలు : మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 12:27 AM IST
కల్కి కథలు : మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు

కల్కి కథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వినకొద్దీ అవినీతి పునాదులు కదులుతున్నాయి. అక్రమాల జాడలు బయటపడుతున్నాయి. భక్తి మాటున సాగుతున్న మత్తు మందు దందాకు బలైన యువతుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఐటీ సోదాల్లో గుట్టలుగా డబ్బు దొరికినా అది గోరంతే అని.. కొండంత అవినీతి సొమ్ము ఇంకా ఆ కోటల్లో దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చిత్తూరు జిల్లాల వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం సమీపంలో ఉన్న ఏకం అధ్యాత్మిక కేంద్రానికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. నాలుగు రోజుల ఐటీ సోదాల్లో కల్కి సామ్రాజ్యపు అవినీతి వ్యవహారమంతా బయటపడింది. 4వందల మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి.. 40 చోట్ల సోదాలు జరిపారు. దాదాపు 5వందల కోట్లు ఆదాయపు పన్ను శాఖకు ఎగ్గొట్టినట్టు ఆధారాలు సేకరించారు. 62 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, 88కిలోల బంగారం, 5 కోట్ల విలువైన వజ్రాలు లభించాయి. వీటితో పాటు విదేశాలకు మళ్లించిన నిధులు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. గోడల్లో దాచిన సొమ్మును బయటకు లాగారు అధికారులు. అయితే కల్కి అవినీతి కేవలం 5వందల కోట్లకే పరిమితం కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భక్తిలో ముంచి అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారని కొందరు బాధితులు వాపోతున్నారు. అంతేకాదు ఆశ్రమాలు, సేవ పేరిట భారీగా సొమ్ములు వసూలు చేశారని కల్కి దంపతులపై విమర్శలు చేస్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపితే లక్షన్నర కోట్లకు పైగా అవినీతి సొమ్ము బయటపడుతుందని అంటున్నారు. ఇక ఆశ్రమంలో జరిగే అవినీతి గురించి కూడా ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ్రమానికి వచ్చే మహిళలకు, యువతులకు మత్తు మందులు అలవాటు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఈ మత్తు ఎక్కువై కొందరు పిచ్చివాళ్లుగా మరికొందరు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.
Read More : బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2