పొత్తు ధర్మాన్ని పాటించా : CPI పొత్తుపై పవన్ క్లారిటీ

  • Published By: madhu ,Published On : March 24, 2019 / 02:41 PM IST
పొత్తు ధర్మాన్ని పాటించా : CPI పొత్తుపై పవన్ క్లారిటీ

పొత్తు ధర్మాన్ని తాను దెబ్బతీయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తులు కుదుర్చుకునే సమయంలో తాను అన్ని విషయాలను సీపీఐ నేతలకు తెలియచేయడం జరిగిందన్నారు. ఏపీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో జనసేన జత కట్టిన సంగతి తెలిసిందే. అయితే..పొత్తుల ధర్మాన్ని పవన్ పాటించడం లేదని వెల్లడిస్తూ కూటమి నుండి సీపీఐ బయటకొస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం బందరు వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్..పొత్తులపై వివరణనిచ్చారు. 

పొత్తులో భాగంగా సీపీఐ ఖరారు చేసిన అభ్యర్థులు సరైన వారు కారని..క్యాడర్ ఎదురు తిరగడం..ఈ విషయాలను సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డికి తెలియచేయడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న సీపీఐ పెద్దలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల విజయవాడ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థిని ప్రకటించడం జరిగిందన్నారు పవన్. గౌరవం లేదని..మిత్ర ధర్మాన్ని పాటించ లేదనే కారణం కాదని..దీనిని అర్థం చేసుకోవాలన్నారు. పొత్తు నుండి వెళ్లిపోతానంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తానని పవన్ చెప్పారు. ఎన్నికల్లో సరికొత్త కూటమిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు..దేశానికి మహిళా శక్తి మాయావతి అని అభివర్ణించారు. ఆమె ప్రధాన మంత్రి కావాలనే వారిలో తాను ఒక్కడినని పవన్ వెల్లడించారు. 

ఇక ఎన్నికల సభలో పవన్ టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేశారు. రౌడీమూకలకు స్థానం లేదని..అలా చేస్తే..కాళ్లు విరగ్గొడుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తానని..మహిళకు ఉచితంగా వంటగ్యాస్ సరఫరా చేస్తానని మరోసారి హామీనిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి 35 ఏళ్ల పాటు భవిష్యత్ మంచిగా ఉండే విధంగా తీర్చిదిద్దుతానన్నారు. కోట్లు కోట్లు దోచుకుని విదేశాలకు వెళుతుంటే..తమ పార్టీలోని నేతలు మాత్రం కోట్లు వదిలేసి ప్రజల కోసం పనిచేసేందుకు ముందుకొస్తున్నారని పవన్ వెల్లడించారు.