కియా మోటర్స్ సీఈఓని వైసీపీ నేతలు బెదిరించారు: పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : December 4, 2019 / 07:30 AM IST
కియా మోటర్స్ సీఈఓని వైసీపీ నేతలు బెదిరించారు: పవన్ కళ్యాణ్

రాయలసీమ యువత మార్పును కోరుకుంటోందని.. తెలుగు భాషను పరిరక్షించండి అంటే వైసీపీ వక్రీకరిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం అవసరమే కానీ.. తెలుగు మీడియం లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తెలుగు మీడియం తీసుకునే అవకాశం ఉండాలని, ఉర్దూ మీడియంను కూడా తీసేసి ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహిస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

అలాగే ప్రభుత్వం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిందని, ఇంగ్లీష్ మీడియానికి తాను వ్యతిరేకం కాదని, కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించినట్లు గుర్తు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఉల్లి ధరలు తగ్గించలేకపోయారని, ప్రజలకు మాణిక్యాలు అక్కర్లేదని, నిత్యావసరాలు ఇస్తే చాలని హితవు పలికారు పవన్ కళ్యాణ్. యురేనియం మైనింగ్ కారణంగా కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలోని ప్రజలకు అనేక జబ్బులు వస్తున్నాయని, అయితే కడప ఉక్కు పరిశ్రమను కోరకుండా… యూరేనియం శుద్ధి కార్మాగారాన్ని వైసీపీ ఎందుకు కోరుకుంది? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 

ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావని, అలాంటిది కియా పరిశ్రమ వస్తే వైసీపీ నాయకులు వాళ్లని బెదిరించారని ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కియా పరిశ్రమ సీఈఓని వైసీపీ నేతలు బెదిరించారని ఆరోపించారు పవన్ కళ్యాణ్.