శ్రీవారికి 40 కిలోల బంగారు బిస్కెట్లు కానుక

  • Published By: nagamani ,Published On : July 14, 2020 / 08:43 AM IST
శ్రీవారికి 40 కిలోల బంగారు బిస్కెట్లు కానుక

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతీ విషయంలోనే ప్రత్యేకమే. ఏడుకొండలపై కొలువైన వెంకన్న వచ్చే కానుకల ఆ ప్రత్యేకత ఎప్పుడూ కనిపిస్తునే ఉంటుంది. భక్తులను ఆశ్చర్యానందంలో ముంచివేస్తునే ఉంటుంది. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి అర్పించిన కానుక పెద్ద విశేషంగా మారింది. ఏకంగా 20 బంగారు బిస్కెట్లను స్వామివారికి నైవేద్యంగా (కానుకగా) సమర్పించాడు. ఆ బిస్కెట్లు ఒక్కొక్కటీ 2కిలోలు ఉన్నాయట. అంటే మొత్తం 40 కిలోలన్నమాట.

ఓ అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్లను శ్రీవారికి నైవేద్యంగా సమర్పించగా..శనివారం (జులై 12,2020) హుండీ లెక్కింపుల్లో భాగంగా ఈ బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఒక్కొక్క బిస్కెట్ 2 కిలో గ్రాముల బరువు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.16.7 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు.

కరోనా వైరస్ పెరుగుతున్న క్రమంలో గత నాలుగు నెలలపాటు తిరుమల దేవస్థానం మూసివుంది. జూన్ 11, 2020 నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచినప్పటి నుంచి చూడగా శ్రీవారికి వచ్చిన అతి పెద్దవిరాళం ఇదేనని తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం దేవస్థానం తెరిచిన తర్వాత నుంచి నేటి వరకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్న 67,000 మంది భక్తులు పలు కారణాలతో పూజకు రాలేదని తెలిపారు.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ కరోనా ప్రభావం తిరుమల ఆలయంపై కూడా పడింది. ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 91 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 3,569 మంది ఉద్యోగులను పరీక్షించారు. దీంతో ఆలయంలో అధికారులు మరిన్ని అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు.