బాబు కోసం : ఏపీలో నేషనల్ లీడర్స్ ప్రచారం

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 12:40 AM IST
బాబు కోసం : ఏపీలో నేషనల్ లీడర్స్ ప్రచారం

ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా… దేవెగౌడ, మమతా బెనర్జీ సహా 10మంది నేతలు చంద్రబాబుకు అండగా ప్రచారం చేయనున్నారు. రోడ్‌ షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండడంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అండగా.. ప్రచారం నిర్వహించేందుకు జాతీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు.

టీడీపీకి మద్దతుగా వాళ్లంతా ప్రచారం చేయనున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మార్చి 26వ తేదీ మంగళవారం ఉదయం అమరావతి చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్రబాబుతో కలిసి కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ తరువాత కర్నూలు, కడప జిల్లాల్లోనే ముస్లిం ఓటర్లు ఎక్కువ. వారిని ఆకర్షించేందుకు ఫరూక్ అబ్దుల్లాను చంద్రబాబు రంగంలోకి దించారు. 

విజయవాడ పరిధిలో చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని ప్రభావితం చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగనున్నారు. మార్చి 28న టీడీపీ తరపున విజయవాడలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇక విశాఖలో స్టీల్ ప్లాంట్, నేవీ ఉద్యోగుల ఓట్లు ఎక్కువ. వారి ఓట్లు సాధించేందుకు మమతా బెనర్జీ రానున్నారు. ఈనెల 31న విశాఖలో టీడీపీ తరపున ఆమె ప్రచారం నిర్వహిస్తారు. ఇక నెల్లూరు అర్బన్ టీడీపీ అభ్యర్ధిగా మంత్రి నారాయణ పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు.

అర్బన్ అభ్యర్ధి విజయంలో యాదవ ఓటర్లదే కీలక పాత్ర. వారిని ఆకర్షించేందుకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపుతున్నారు. ఏప్రిల్ 2న అఖిలేష్ యాదవ్ నెల్లూరులో టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక నెల్లూరు, చిత్తూరు జిల్లాలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి ఓటర్లు టీడీపీ వైపు మొగ్గుచూపేలా డీఎంకే అధినేత స్టాలిన్‌ రంగంలోకి దిగనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి టీడీపీ ప్రచారంలో పాల్గొనున్నారు. ఇక, రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన అనంతరం చంద్రబాబునాయుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లనున్నారు.