రోడ్డుపై అనాథ శవం అంతిమయాత్ర చూస్తే కన్నీళ్లే

  • Published By: chvmurthy ,Published On : September 6, 2019 / 02:58 PM IST
రోడ్డుపై అనాథ శవం అంతిమయాత్ర చూస్తే కన్నీళ్లే

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మానవత్వం మంటగలిసింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకం….నివ్వెరబోయేలా చేసింది. అనాథ శవంపై చూపిన అశ్రధ్ధ… కోపం తెప్పిస్తోంది. చెత్త ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన కలచివేస్తోంది. 

అనాథ శవాలకు మున్సిపల్ సిబ్బంది అంతిమ సంస్కారాలు జరిపించడం మామూలే అయినప్పటికీ, శివంగా భావించే శవాన్ని పట్టపగలు జనమంతా చూస్తుండగా జరిగిన ఈ దయనీయ తరలింపు… అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మూడు గుడుల సెంటర్‌లో ఒక అనాథ యాచకుడు మృతి చెందాడు. అయితే సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది అక్కడకి చేరుకున్నారు. మృతుని సంబంధీకులెవరూ లేరని నిర్ధారించుకున్నాక శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

అంతిమయాత్ర వాహనాలు ఉన్నప్పటికీ..  చెత్తను తరలించడానికి ఉపయోగించే ఒక చిన్న తోపుడు బండిని తీసుకువచ్చారు. అందులో శవాన్ని స్మశానికి తరలించే కార్యక్రమానికి పూనుకున్నారు ప్రబుద్దులు. అయితే తోపుడు బండి చిన్నదిగా ఉండటంతో కాళ్లు బయటకు వేలాడుతున్నాయి. ముఖం కనిపించకుండా పైన గుడ్డ కప్పి, అక్కడి నుండి తోపుడు బండిని తోసుకుంటూ స్థానిక కైలాసభూమికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రాజమహేంద్రవరం మున్సిపల్‌ సిబ్బందిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.