ఆ పాలు తాగితే అంతే సంగతులు : గేదెలు, ఆవులకు నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతి, పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవడం పాల వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 03:40 PM IST
ఆ పాలు తాగితే అంతే సంగతులు : గేదెలు, ఆవులకు నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతి, పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవడం పాల వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మీరు తాగే పాలన్నీ స్వచ్ఛమైనవి అనుకుంటే అంతే. మీకు తెలియకుండానే రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతి, పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవడం పాల వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఆక్సిటోసిన్… ఇదో హార్మోన్. మనుషుల శరీరాల్లోనే కాదు, పశువుల శరీరాల్లో కూడా సహజసిద్ధంగా ఈ హార్మోన్ ఉంటుంది. స్త్రీకి కాన్పు సమయంలో అవసరమైనప్పుడు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్ వేస్తారు. ఆక్సిటోసిన్ హార్మోను శరీర కండరాలపై ఒత్తిడి పెంచి కాన్పు సులువుగా కావడానికి దోహదపడుతుంది. ఇదే సందర్భంలో ఈ హార్మోన్ ఇంజక్షన్ గేదెలకు సైతం వేస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. సాధారణ పరిస్థితుల్లోనూ గేదెలకు, ఆవులకు సైతం ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేస్తున్నారు. కేవలం అధిక పాల ఉత్పత్తి కోసమే ఈ అనైతిక, అక్రమ వ్యవహారానికి కొందరు పాల్పడుతున్నారు.

ఆక్సిటోసిన్ కారణంగా గేదె శరీర కండరాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సహజంగా జరిగే శరీర ప్రక్రియ పై ఈ హార్మోను గట్టిగా పనిచేస్తుంది. సాధారణంగా ఐదు లీటర్ల పాలు ఇచ్చే గేదె… ఈ హార్మోను ఇంజక్షన్ వల్ల శరీరం ఉత్తేజాన్ని గురై మరో రెండు, మూడు లీటర్ల పాలు అధికంగా ఇస్తుంది. సాధారణంగా గేదె లేదా ఆవు తమ శరీరంలో ఉండే మొత్తం పాలను బయటకు ఇవ్వవు. పొదుగులో ఉండే మొత్తం పాలు పిండినప్పుడు సులువుగా వచ్చేస్తుంది. అయితే వాటి శరీర కండరాల్లో, ఎముకల మూలన ఇంకా కొంత పాలు అలానే ఉంటుంది. మామూలుగా అయితే పొదుగుకు చేరిన పాలు బయటకు వస్తాయి తప్ప శరీరంలో మిగతా చోట్ల నిల్వ ఉండే పాలు బయటకు రావు. కానీ ఎప్పుడైతే వాటికి ఇంజక్షన్ ద్వారా కృత్రిమ ఆక్సిటోసిన్ శరీరంలోకి పంపుతామో… అప్పుడు వాటి శరీరం అదనపు ఉత్తేజానికి గురై శరీరంలో మిగతా చోట్లా దాగి ఉన్న పాలు బలవంతంగా బయటకు వచ్చేస్తాయి. 

పశువులు ఆ సమయంలో మాటలకు అందని బాధ అనుభవిస్తాయి. ఈ కారణంగానే ఇండియన్ వెటర్నరీ కౌన్సిల్ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లపై నిషేధం విధించింది. అధిక పాల ఉత్పత్తి కోసం వీటిని ఆవు లేదా గేదెలకు వేయకూడదు. అసలు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల ఆమ్మకం పై నిషేధం కూడా అమల్లో ఉంది. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని అమ్మడం లేదా కొనడం నేరం. దండిగా పాలు పిండుకోవడం కోసమే పశువులకు ఈ నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్లు వేస్తున్నారు. చిల్లర డబ్బులకు ఆశపడి కొంతమంది రైతులు, పాలడైరీ యజమానులు ఈ అక్రమ వ్యవహారానికి తెర తీస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన పాలను కల్తీ చేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ హార్మోన్ ఇంజక్షన్లు కారణంగా మూగజీవాలను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నారు. సంబంధిత పాలు తాగే వారికి కూడా అనారోగ్య ముప్పు పొంచి ఉంది. 

పాడి పశువుల పైనా, ఆపై మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమయ్యాయి. తిరుపతిలోని ఓ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు సాధారణ రైతులు కూడా ఈ ఇంజక్షన్లతో పెద్ద వ్యాపారమే చేస్తున్నారు.

తిరుపతి రూరల్‌ ఎంఆర్‌పల్లి సమీపంలోని ఉల్లిపట్టెడలో నారాయణ అనే పాడి రైతు ఇంట్లో రహస్యంగా దాచి, ఇతరులకు విక్రయిస్తున్న ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. 100 ఎంఎల్‌ పరిమాణం కలిగిన 40 ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఉన్న కృత్రిమ ఆక్సిటోసిన్‌ను అధికారులు సీజ్‌ చేశారు. 100 ఎంఎల్‌ బాటిల్‌ నుంచి 1 ఎంఎల్‌ చొప్పున 100 పశువులకు ఇంజెక్షన్లు వేస్తూ… ఒక్కొక్కదానికి 150 నుంచి 200 రూపాయల వరకు  ఈ రైతు వసూలు చేస్తున్నట్టు డ్రగ్‌ కంట్రోల్ అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమిళనాడు సరిహద్దు నుంచి ఈ ఇంజెక్షన్లను 100 ఎంఎల్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లలో చిత్తూరు జిల్లాకు రహస్యంగా వస్తున్నట్లు గుర్తించారు. తిరుపతి చుట్టుపక్కల అనేక చోట్ల ఈ అక్రమ దందా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ ముఠా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల దందా కొనసాగిస్తోందని అనుమానిస్తున్నారు.

ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ వాడితే పశువుల హార్మోన్‌లలో అసమతుల్యత ఏర్పడుతుంది. పదేళ్లు బతికే పశువు నాలుగైదేళ్లకే చనిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఇక కృత్రిమ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల ఉత్పత్తి అయిన పాలు ఓ రకంగా విషంతో సమానమని వైద్యులు అంటున్నారు. ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల సాయంతో ఉత్పత్తి అయ్యే పాలు తాగిన వారిని క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక చిన్న పిల్లలకైతే మరింత త్వరగానే దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం ఉందంటున్నారు.