వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు

  • Published By: vamsi ,Published On : February 24, 2020 / 11:01 AM IST
వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు

చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫి అనే నిందితుడిని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది కోర్టు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన చిన్నారి వర్షితను రఫి అనే వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన 2019 నవంబర్ ఏడవ తేదీన చోటుచేసుకొంది.

ఈ ఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. చిన్నారి వర్షితపై దాడికి పాల్పడిన నిందితుడిని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు. మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ చిన్నారి వర్షితపై అత్యాచారం చేసి హత్యచేసినట్టుగా గుర్తించారు. అదే ఏడాది నవంబర్ 16వ తేదీన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

చిన్నారి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా, పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.  డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎట్టకేలకు ఇవాళ(24 ఫిబ్రవరి 2020) తుది తీర్పు వెల్లడించింది. 

బి. కొత్తకోట మండలం గట్టు పంచాయితీ గుట్టపాలెంకు చెందిన సిద్దారెడ్డి, ఉషారాణి దంపతుల కూతురు వర్షిత, ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వైష్ణవి, వర్షిణి, వర్షిత. నవంబర్ 08వ తేదీ ఉదయం 6.30 గంటల సమీపంలో కళ్యాణ మండపానికి వెనుకవైపు ప్రహారీ కింద వర్షిత విగతజీవిగా కనిపించింది. అనంతరం జరిగిన విచారణలో అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.