దాచేపల్లిలో ఉద్రిక్తత : పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 08:17 AM IST
దాచేపల్లిలో ఉద్రిక్తత : పోలింగ్ కేంద్రంలోనే కొట్టుకున్న టీడీపీ-వైసీపీ శ్రేణులు

గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ వర్గాన్ని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరి ఘర్షణలో పోలింగ్ కేంద్రంలో ఉన్న సామాగ్రి ధ్వంసమైంది. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి పంపేశారు.

పల్నాడు ప్రాంతంలో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో గురజాల ఒకటి. గురువారం(ఏప్రిల్ 11, 2019) ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఏజెంట్లు, కార్యకర్తలు పరస్పరం వాదులాడుకుని తన్నుకుంటున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లిలో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.