అమ్మవారి ఆన్ లైన్ వరాలు: వైష్టోదేవి ప్రసాదం డోర్ డెలివరీ..ప్రారంభించిన గవర్నర్

  • Published By: nagamani ,Published On : September 22, 2020 / 10:59 AM IST
అమ్మవారి ఆన్ లైన్ వరాలు: వైష్టోదేవి ప్రసాదం డోర్ డెలివరీ..ప్రారంభించిన గవర్నర్

భగవంతుడిని కనులారా దర్శించుకుని ప్రసాదం తీసుకోవటానికి గుడికే వెళ్లాలి. కానీ ఇది కరోనా కాలం. కష్టాల కాలంలో భాగంగా భగవంతుడి దగ్గరకు భక్తుడు వెళ్ళకుండా సాక్షాత్తూ భగవంతుడే భక్తుల వద్దకు వచ్చి వరాలు ఇస్తున్నాడు. దీంట్లో భాగంగానే అమ్మలగన్న అమ్మ శ్రీ వైష్ణోదేవి ప్రసాదాలను భక్తుల వద్దకే నేరుగా పంపించే ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. వైష్ణోదేవి అమ్మవారి ప్రసాదాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ ద్వారా అందజేస్తున్నారు నిర్వాహకులు.




దర్శనాలు, ప్రసాదాలు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్న క్రమంలో జమ్మూకశ్మీర్‌లో కొలువైన అమ్మవారు ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాన్ని బుక్ చేసుకున్న భక్తుల ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదాన్ని పంపించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

జమ్ము కశ్మీర్ లోని త్రికూట పర్వతాలపై కొలువైన వైష్ణోదేవి అమ్మవారిని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దర్శనాలకు ఇబ్బంది ఏర్పడటంతో ప్రసాదం హెం డెలివరీ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న 72 గంటల్లోగా స్పీడ్ పోస్టు ద్వారా పూజా, ప్రసాదాలను అందించనున్నారు. వైష్ణోదేవి ఆలయ వెబ్ సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవాలని సూచించారు.