మదనపల్లి డబుల్ మర్డర్ : పురుషోత్తం కుటుంబానికి ఐదు కోట్ల ప్రాపర్టీ వివాదం ? హత్య వెనుక ఎవరున్నారు

మదనపల్లి డబుల్ మర్డర్ : పురుషోత్తం కుటుంబానికి ఐదు కోట్ల ప్రాపర్టీ వివాదం ? హత్య వెనుక ఎవరున్నారు

Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ పిల్లలను బలి ఇవ్వడం ఏంటి? తల్లిదండ్రుల్లో మూఢభక్తి నింపిన వారిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

ఐదు కోట్ల ప్రాపర్టీ వివాదం :-
పురుషోత్తం కుటుంబానికి చెందిన 5 కోట్ల రూపాయల ప్రాపర్టీ వివాదం ఉన్నట్టు స్థానికులు, పురుషోత్తంనాయుడు కొలీగ్స్‌ చెబుతున్నారు. ఈ వివాదం కారణంగా ఎవరైనా ఈ కుటుంబానికి అలవాటైన అతి ఆథ్యాత్మిక చింతనను ఆసరాగా చేసుకుని మాస్‌ హిప్నాటిజం చేశారా ? లేదా మెదడుపై విపరీతమైన ప్రభావం చూపి, చిత్తభ్రమలకు గురి చేసే ఏదైనా మత్తు పదార్థాలు ఇచ్చారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

సీసీ కెమెరాలు కీలకం :-
పద్మజ, పురుషోత్తమ్‌నాయుడులు కొత్తగా సకలహంగులతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇందులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫుటేజీని పరిశీలిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. పోలీసుల రిమాండ్‌ రిపోర్టు ప్రకారం కుక్కను వాకింగ్ కి తీసుకెళ్లినప్పుడు రోడ్డుపై ఉన్న నిమ్మకాయ, పసుపు, కుంకుమలు తొక్కినప్పటి నుంచి ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి ఘటన జరిగిన రోజు వరకు ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు ? ఎంత సేపు ఉన్నారు అనేది సీసీ కెమెరాల్లో రికార్డయి ఉంటుంది. అది పోలీసుల చేతికి చిక్కినప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుస్తుంది.

మూఢత్వంగా మారకూడదు :-
అతీంద్రియ శక్తులను ఉన్నట్లుగా ఊహించుకోవడమే హత్యలకు కారణమైందా..? అనేదే ఇప్పుడు అందరి ముందు మెదులుతున్న ప్రశ్న. మొత్తంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చినమ్మకం తీర్చలేని నష్టానికి కారణమైందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. దైవమన్నది ఒక మధురమయిన ఊహ. మానవులు కనిపెట్టిన అన్నిటిలోకీ అద్భుతమయిన భావన. ఏ ప్రశ్నకూ దైవం సమాధానం కాకపోవచ్చును కానీ, ప్రశ్నలను ఉపశమింపజేసే శక్తి మాత్రం దైవానికి ఉంది. అయితే.. అది మూఢత్వంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.