175 సీట్లకు దగ్గరగా వస్తాం..! అభద్రతా భావంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు- మంత్రి బొత్స

ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.

175 సీట్లకు దగ్గరగా వస్తాం..! అభద్రతా భావంతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు- మంత్రి బొత్స

Updated On : May 17, 2024 / 6:10 PM IST

Botcha Satyanarayana : ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో అనవసరంగా తమపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. అధికారుల తొందరపాటు నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు. తమకు ఎలాంటి అభద్రతా భావం లేదన్న బొత్స.. 175 సీట్లకు దగ్గరగా వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

జూన్ 9న విశాఖ కేంద్రంగా జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించకండని ఆయన విజ్ఞప్తి చేశారు. హింసను ప్రోత్సహించకండి అని కోరారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ గొడవను అనవసరంగా రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ అధికారిని నియమించే ముందు పూర్వపరాలు చూస్కోవాలన్నారు. అలా కాకుండా నియమించడం వల్లే గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు మంత్రి బొత్స. అంతేకానీ అభద్రతా భావంతో కాదని తేల్చి చెప్పారు. అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహారించాలని మంత్రి బొత్స అన్నారు.

”175 కి 175 సీట్లు సాధిస్తాం. ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. అవి అధికారిక భవనాలు, అధికారికంగానే ఉపయోగిస్తాం. గెలుపు మీద నమ్మకం లేకే మహానాడులు క్యాన్సిల్ చేసుకున్నారు. మా మీద ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలి. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి” అని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.

”రాజకీయ లబ్ది కోసమే హింసను ప్రేరేపిస్తున్నారు. హింసాత్మక ఘటనల వ్యవహారంలో అనవసరంగా మాపై నిందలు మోపుతున్నారు. ఈసీ తొందరపాటు నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. సెంట్రల్ కమిషన్ కు ఫిర్యాదు చేశాం. అంతే తప్ప మేమేమీ అభద్రతా భావంతో ఫిర్యాదు చేయలేదు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదని, శాంతియుత వాతావరణం ఉండాలని, సోదరభావంతో మెలగాలని ఆశిస్తున్నాం” అని మంత్రి బొత్స అన్నారు.

Also Read : చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక