తెలంగాణలో ఇకపై పూటకూళ్ల ఇళ్లు

ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న పూటకూళ్ల ఇళ్లు అనే సంప్రదాయం కనుమరుగైన వేళ.. మరోసారి వాటిని తెచ్చే ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర పర్యాటక శాఖ సూచనల మేరకు హోటళ్లు.. రెస్టారెంట్లకు బదులు పూటకూళ్ల ఇళ్లు రావాలనుకుంటున్నారట. ఇవంటే ఏంటో కొత్త ఇళ్లు అనేమీ కాదు. ఆహారంతో పాటు వసతి ప్రతి పూట అందజేస్తారు. ప్రతి పూట ఇంటి భోజనం తిని దగ్గరల్లో ఉన్న ప్రదేశాలను చుట్టేసి రావొచ్చు. పర్యాటక ప్రాంతాల్లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆస్వాదించాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగడపడతాయి.
భారత్‌లో గతేడాది 1.5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు పర్యటిస్తే అందులో 18 లక్షల మంది తమిళనాడుకు రాగా, తెలంగాణకు 3.8లక్షలు మాత్రమే వచ్చారు. తమిళనాడుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం పర్యాటకుల వృద్ధి కనిపించడం లేదు. కేంద్రప్రభుత్వం గతంలో ‘హోమ్ స్టే’పథకాన్ని రూపొందించింది. దీనికి ‘బెడ్, బ్రేక్‌ఫాస్ట్’స్కీంగా నామకరణం చేసింది. దీన్ని రాజస్తాన్, తమిళనాడులాంటి రాష్ట్రాలు చక్కగా అమలు చేస్తున్నాయి. ఇంకా అటువంటి తెలంగాణలో అమలుకాలేదు.
కొన్ని రాష్ట్రాలు ఈ ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఉండేవారు ఇళ్లలోని కొంత భాగాన్ని పర్యాటకులు తాత్కాలికంగా ఉండేలా తీర్చిదిద్ది ఆదాయం పొందుతున్నారు. ఇంటి భోజనాన్నే వడ్డిస్తుండటంతో సురక్షిత ప్రాంతమనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తే ఎంతటి మారుమూల ప్రాంతానికైనా విదేశీ, స్వదేశీ పర్యాటకులు వస్తారని తేలింది. రెస్టారెంట్లు, హోటళ్లు ఇదే అదనుగా భావించి రేట్లు దండుకుంటున్నాయి.
ఇలా ఉండాలి:
* ఇంటిలో కనిష్టంగా ఓ గది, గరిష్టంగా 6 గదులు పర్యాటకులకు కేటాయించాలి.
* టాయిలెట్లు, స్నానాల గదులు కచ్చితంగా ఉండాలి. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్ ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి.
* ఇంటి యజమానులు కూడా అదే ప్రాంగణంలో నివాసం ఉండాలి. అక్కడే భోజన వసతి కల్పించాలి.
* విద్యుత్తు వసతి, మంచాలు, శుభ్రమైన పరుపు, దుప్పట్లు, శుభ్రమైన నీటి వసతి, ఫ్యాన్, దోమల నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు అవసరం.
* ఏసీ, కూలర్ లాంటి ఏర్పాట్లు ఉంటే మంచి వసతి గదులుగా పరిగణిస్తారు.
* పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో నమోదు తప్పనిసరి.
* వసతి గదులు ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా సంబంధిత పర్యాటకశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అధికారులు ఆ గదులను పరిశీలించి యోగ్యంగా ఉంటే అనుమతిస్తారు. వాటి వివరాలు, సమీపంలోని పర్యాటక ప్రాంతాలు ఉండాలి.
* ఫోన్ నెంబర్లు, ఇళ్ల ఫొటోలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వాటిని పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా చూసి ఎంచుకునే అవకాశం ఉంటుంది.
* భోజనం, అద్దె తదితర వివరాలు కూడా డిస్‌ప్లేలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ వివరాలు ఉండాలి.
* తమిళనాడు, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉండటంతో పర్యాటకులు ఆయా ప్రాంతాలలో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.