శ్రీశైలానికి మళ్లీ వరద 

శ్రీశైలానికి మళ్లీ వరద 

Updated On : September 7, 2019 / 5:28 AM IST

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెటెత్తింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షా 987 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, కల్వకుర్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 95వేల 963 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 182.60 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింతగా పెరుగనుంది. 

కృష్ణా, తుంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలలో రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లోకి ఈ పాయ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భీమా నదిలో వరద ప్రవాహం పెరుగడంతో ఉజ్జయిని జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి లక్షా 90 వేల క్యూసెక్కులు చేరుతుండగా, 2 లక్షల మూడు క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోనూ వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో తుంగభద్ర జలాశయం నుంచి 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటిలో నాగార్జున సాగర్ కు 23 వేల 260 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో కుడి, ఎడమ కాలువలు, పులిచింతల, ఏఎమ్మార్పీలకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 9 వేల 753 క్యూసెక్కులు చేరుతుండగా 5 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 11 వేల 451 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 16 వేల 774 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

Also Read : ప్రకటనలు బంద్ : నిషేధం విధించిన గూగుల్