ప్రపంచంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 07:16 AM IST
ప్రపంచంలో కరోనా కేసులు ఎన్నో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న మొత్తం 97వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది.

అమెరికాలో :-
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో నిన్న మొత్తం 29వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 78వేల మందికిపైగా మృతి చెందగా.. కరోనా బారినపడి 2లక్షల 23వేల మంది కోలుకున్నారు. దాదాపు 17 వేల మంది చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 10లక్షల మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

విలవిలలాడుతున్న రష్యా :-
కరోనా కేసులతో రష్యా విలవిల్లాడుతోంది. అమెరికా తర్వాత అత్యంత వేగంగా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రష్యాలోనే అధికంగా ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 10వేల 699 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుసగా ఆరోరోజు పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య లక్షా 87వేల 859కు పెరిగింది. కరోనా బాధితుల  పరంగా రష్యా ప్రపంచంలో ఐదో స్థానానికి చేరింది. అక్కడి  కేసులు, మరణాల్లో సగానికి పైగా దేశరాజధాని మాస్కోలోనే ఉన్నాయి. నిన్న 98 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,723కు పెరిగింది.

పాకిస్తాన్‌లో :-
పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో ఒకేరోజు 1791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26వేల 435కి చేరింది. నిన్న 14మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 599కి పెరిగింది.

పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 10వేల 33 మంది కొవిడ్-19 వ్యాధికి గురికాగా.. సింధ్‌లో 9వేల 93 మంది, బలూచిస్తాన్‌లో 1,725, ఇస్లామాబాద్‌లో 558 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నా… ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయనున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించండం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

భారతదేశంలో :-
దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. 59 వేల 662కు చేరాయి పాజిటివ్‌ కేసులు. దేశంలో 1,981 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 17,847మంది డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో 39,834 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 19 వేల 63 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. 731 మంది మృతి చెందారు.

భారతదేశాన్ని కరోనా వైరస్‌ భయపెడుతోంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతోంది. తొలుత పదుల సంఖ్యలో మొదలైన కేసులు… ఆ తర్వాత వందలకు చేరాయి. ఇప్పుడు ప్రతిరోజూ  వెయ్యి మందికిపైగా కరోనా బారినపడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. లాక్‌డౌన్‌ను మూడు సార్లు విధించినా… కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. పైపెచ్చు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ మాత్రం అదుపులోకి రావడం లేదు.
 

Read More:

ఇదో కొత్త కోణం.. సెక్స్‌తో పెరుగుతున్న కరోనా కేసులు

ఒక్క రోజే అమెరికాలో 1635 కరోనా మరణాలు