సారీ చెప్పిన ఎల్ జీ పాలిమర్స్ 

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 09:25 AM IST
సారీ చెప్పిన ఎల్ జీ పాలిమర్స్ 

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఎల్ జీ పాలిమర్స్  గ్యాస్ ఏపీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్యాస్ లీక్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు 300 మంది దాక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పరిశ్రమకు సమీపంలో ఉన్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ జీ పాలిమర్స్ స్పందించింది. విషాదానికి కారణమైన దుర్ఘటనపై క్షమాపణలు చెప్పింది. 

దీని కారణంగా ఇబ్బందులు పడిన కుటుంబాలకు, ప్రజలకు అండగా ఉంటామని, ప్రభుత్వంతో అన్న విధాల సహకరిస్తామని వెల్లడించింది. 2020, మే 09వ తేదీ శనివారం ఒక ప్రకటన వెలువడించింది. విష వాయువు ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ఎల్‌జీ పాలిమర్స్‌ వెల్లడించింది. ఇందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామన్నారు. 

విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ నుంచి 2020, మే 07వ తేదీ గురువారం తెల్లవారజామున విష వాయువులు వెలువడ్డాయి. నిద్రలో ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. అంతేగాకుండా..ప్రమాదం ఏదైనా సంభవిస్తే..మోగాల్సిన సైరన్ శబ్ధం చేయలేదు. దీంతో చాలా మందికి ఊపిరిఆడలేదు. 12 మంది చనిపోయారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స లందించారరు.