Shejal : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఢిల్లీలో శేజల్ వినూత్న నిరసన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్

Shejal : తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారామె.

Shejal : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఢిల్లీలో శేజల్ వినూత్న నిరసన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్

Shejal

Shejal – Durgam Chinnaiah : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న శేజల్.. తన నిరసన పర్వం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి శేజల్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం జరుపుతున్న సమయంలో శేజల్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

Also Read..Cyber Criminals : సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి.. రూ. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

మహిళల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మాత్రం న్యాయం చేయడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వేడుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతోనే చిన్నయ్యపై చర్యలు తీసుకోవడం లేదని శేజల్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారామె. మరో దారి లేకనే సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. జాతీయ మహిళా కమిషన్.. ఇప్పటికే చిన్నయ్యను పిలిపించి విచారించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు శేజల్.

బెల్లంపల్లి ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్న ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, చిన్నయ్యని సస్పెండ్ చెయ్యాలని శేజల్ డిమాండ్ చేశారు.

” సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నారు. కానీ, నాకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే స్పందించడం లేదు. దుర్గం చిన్నయ్యపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిరసన తెలపడంలో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశా. పాలాభిషేకంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. ప్రభుత్వ భూమిని తన భూమిగా చెప్పి మాకు అమ్మడంతో పాటు లైంగికంగాను నన్ను వేధించారు. ఎమ్మెల్యే దగ్గరకి వెళ్లాలంటూ పోలీసులు నాపై ఒత్తిడి తెచ్చారు.

Also Read..Errabelli Dayakara Rao: కేసీఆర్ విజన్ వల్లే.. తెలంగాణలో మాత్రమే బోర్లు వేసుకునే అనుమతి

బెల్లంపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారు. మూడురోజుల పాటు కిడ్నాప్ చేసి ఆధారాలు తీసుకుని, మాపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. కేసులు ఎవరూ పెట్టకపోయినా మమ్మల్ని అదుపులోకి తీసుకుని ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలంటూ సీఐ బాబురావు, ఎస్ఐ రాజశేఖర్, ఆంజనేయులు బెదిరించారు. తెలంగాణలో ఫిర్యాదులు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే సీబీఐని ఆశ్రయించాం. కోర్టుకు వెళ్దామనుకుంటే పోలీస్ స్టేషన్ లోనే మమ్మల్ని బెదిరించారు. ఈ పోరాటంలో నా కుటుంబసభ్యుల మద్దతు నాకుంది” అని ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ అన్నారు.