Assembly Elections 2023: కాంగ్రెస్‭కు ఎస్పీకి చెడిందా? 2024 ఎన్నికలపై పెద్ద ప్రకటనే చేసిన శివపాల్ యాదవ్

ఇండియా కూటమిలో పరిస్థితి బయటికి కనిపించేలా లేదు. ఒక్క ఎస్పీ మాత్రం ఈ విషయంలో బహిరంగమైనప్పటికీ.. మిగతా అన్నీ పార్టీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది

Assembly Elections 2023: కాంగ్రెస్‭కు ఎస్పీకి చెడిందా? 2024 ఎన్నికలపై పెద్ద ప్రకటనే చేసిన శివపాల్ యాదవ్

Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ-సమాజ్‭వాదీ పార్టీల మధ్య పరిస్థితులు కాస్త అయోమయం కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య వివాదం తీవ్ర స్థాయికి పోయినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పి ఉంటే.. ఆ పార్టీ నేతల ఫోన్ కూడా ఎత్తేవాడిని కాదంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ శుక్రవారం తీవ్ర స్థాయిలో స్పందించారు. మరో అడుగు ముందుకేసి వాళ్లు ద్రోహం చేస్తారని అనుకోలేదని కూడా అన్నారు. అనంతరం.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజయ్ రాయ్ ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అఖిలేష్ వ్యాఖ్యల అనంతరం రాయ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్‭సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అన్నారు.

దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఇక ఊడినట్టేనని అంటున్నారు. ఇక శుక్రవారం ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని ఇచ్చాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. అది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలని శివపాల్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు తాము సెక్యూలర్ పార్టీలతో స్నేహం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఎవరు కలవాలనుకుంటున్నారో, ఎవరు విడిపోవాలనుకుంటున్నారో వారిష్టమని ఆయన అన్నారు. కాంగ్రెస్ మీద ఎస్పీ చాలా కోపంగా ఉన్నట్లు శివపాల్ యాదవ్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi : ఇవి దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు : రాహుల్ గాంధీ

వాస్తవానికి ఇండియా కూటమిలో పరిస్థితి బయటికి కనిపించేలా లేదు. ఒక్క ఎస్పీ మాత్రం ఈ విషయంలో బహిరంగమైనప్పటికీ.. మిగతా అన్నీ పార్టీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించి, ఎట్టకేలకు కూటమిని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీ వేరే వాదనలు వినిపిస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట.. ఇతర పార్టీలను కలుపుకుపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.