Modi Diwali Celebrations: 10 ఏళ్లుగా సైనికులతోనే దిపావళి జరుపుకుంటున్న ప్రధాని మోదీ.. ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసా?

2020లో ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.

Modi Diwali Celebrations: 10 ఏళ్లుగా సైనికులతోనే దిపావళి జరుపుకుంటున్న ప్రధాని మోదీ.. ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసా?

Modi Diwali Celebrations: ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు దీపావళి పండుగను పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆక్కడ భద్రతా బలగాలతో కలిసి ఆయన దీపావళి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను కూడా దేశ ప్రజలతో పంచుకున్నారు.

భద్రతా బలగాలు, సైనికుల మధ్య దీపావళి జరుపుకునేందుకు ప్రధాని మోదీ రావడం ఇది తొలిసారేం కాదు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి ఏటా దీపావళి వేడుకలు సైనికులతోనే జరుపుకుంటున్నారు. 2014 నుంచి 2022 వరకు ప్రధాని మోదీ వివిధ ప్రాంతాల భద్రతా దళాలతో దీపావళి జరుపుకున్నారు. అయితే ప్రతిసారీ వేడుకలో ఆయనలోని విభిన్నమైన, కొత్త శైలి కనిపిస్తుంటుంది. మరి 10 దిపావళి సంబరాల వివరాలు ఏంటో తెలుసుకుందా..

2014లో సియాచిన్‌లో


2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి దీపావళి వేడుకలను సియాచిన్‌లో జరుపుకున్నారు. ఆ సమయంలో “సియాచిన్ గ్లేసియర్ మంచు శిఖరాల నుంచి వీర సైనికులు,సాయుధ దళాల అధికారులతో పాటు, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశాడు.

2015లో పంజాబ్‌లో


1965లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికులను, వారి విజయంలో నిర్మించిన మూడు స్మారక చిహ్నాలను 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇది 1965 యుద్ధానికి 50వ వార్షికోత్సవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అత్యంత కఠినమైన యుద్ధ ప్రదేశంగా పేరొందిన అమృత్‌సర్‌లోని డోగ్రాయ్ వార్ మెమోరియల్‌కు వెళ్లారు. భారత సాయుధ దళాల వీర జవాన్లు రక్తాన్ని చిందించి, ఆ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన ప్రదేశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రధాని మోదీ చెప్పారు.

2016లో హిమాచల్ ప్రదేశ్ లో


2016లో చైనా సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో సముదోహ్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ), డోగ్రా స్కౌట్స్, ఆర్మీ సిబ్బందితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ ఏడాది దీపావళి రోజున కూడా ప్రధాని మోదీ చాంగో గ్రామాన్ని సందర్శించారు.

2017 కాశ్మీర్‌లో


2017లో కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో మోహరించిన సైనికులతో ప్రధాని మోదీ సంబరాలు చేసుకున్నారు. అనంతరం తన సోషల్ మీడియా ద్వారా ఆయనస్పందిస్తూ.. ‘‘ప్రజలు దీపావళిని కుటుంబంతో జరుపుకుంటారు. ఈ సైనికులే నా కుటుంబం. సైనికులకు వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు. సాయుధ బలగాల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కుర్తా-పైజామా మరియు దానిపై సైనికుల యూనిఫాం జాకెట్ ధరించారు.

2018లో కేదార్‌నాథ్ ధామ్


2018లో దీపావళి రోజున ప్రధాని మోదీ కేదార్‌నాథ్ చేరుకుని కేదార్ బాబాకు పూజలు చేశారు. అయితే దీనికి ముందు ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో దీపావళిని పురస్కరించుకుని సైనికులను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెడ్ కలర్ క్యాప్, ఆర్మీ గ్రీన్ కలర్ జాకెట్ ధరించారు. సైనికులతో సమావేశమైన ప్రధాని మోదీ వారికి స్వీట్లు తినిపించారు.

2019లో రాజౌరిలో


2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో మోహరించిన భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి జరుపుకున్నారు. ఆర్టికల్ 370ని రద్దు అనంతరం ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్ని తొలి దీపావళి అది. ఈ సమయంలో ఆర్మీ ప్రింట్ జాకెట్‌లో మోదీ కనిపించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న చిత్రాన్ని నెటిజెన్లతో పంచుకున్నారు.

2020లో రాజస్థాన్‌లో


2020లో ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు ప్రధాని మోదీ. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. సైనికులతో కలిసి ఉన్నప్పుడే దీపావళి జరుపుకుంటామని చెప్పారు.

2021లో నౌషేరాలో


2021లో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో ప్రధాని మోదీ దీపావళి జరుపుకున్నారు. ఇక్కడ ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏటా దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 2019 తర్వాత ప్రధాని మోదీ వరుసగా రెండోసారి రాజౌరీ చేరుకున్నారు. ఈ సమయంలో అతను ఆర్మీ గ్రీన్ కలర్ జాకెట్, బ్లాక్ క్యాప్‌లో కనిపించాడు.

2022లో కార్గిల్‌లో


2022 సంవత్సరం అంటే గతేడాది ప్రధాని మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సమయంలో అతను ఆర్మీ ప్రింట్ జాకెట్, టోపీలో కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను షేర్ చేశారు. అందులో సైనికులకు మోదీ స్వీట్లు తినిపిస్తూ కనిపించారు.