Raayan Review : ‘రాయన్’ మూవీ రివ్యూ.. ధనుష్ 50వ సినిమా ఎలా ఉందంటే..?

తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేసాడు అని రా అండ్ రస్టిక్ గా, ట్విస్టులతో చూపించారు.

Raayan Review : ‘రాయన్’ మూవీ రివ్యూ.. ధనుష్ 50వ సినిమా ఎలా ఉందంటే..?

Dhanush Sundeep Kishan Raayan Movie Review and Rating

Dhanush Raayan Movie Review : తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాగా ‘రాయన్‘ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించడం గమనార్హం. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి.. పలువురు ముఖ్య పాత్రలు చేశారు. రాయన్ సినిమా నేడు జూలై 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కార్తవ రాయన్(ధనుష్) తన తమ్ముళ్లు ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్), తన చెల్లి దుర్గ(దుషారా విజయన్) లను ఇంట్లో ఉంచి చిన్నప్పుడు బయటకి వెళ్లి వస్తానని చెప్పి తల్లితండ్రులు తిరిగిరారు. తల్లితండ్రులు ఏమయ్యారో తెలీక ఊర్లో తమకు తెలిసిన వ్యక్తికి చెప్తే అతను తన చెల్లిని అమ్మడానికి ప్రయత్నిచడంతో అతన్ని రాయన్ చంపేసి ఆ ఊరు నుంచి బయటకి వచ్చి దూరంగా బతుకుతారు. ఓ మార్కెట్లో శేఖర్(సెల్వ రాఘవన్) వీళ్లకు ఆసరా ఇస్తాడు.

పెద్దయ్యాక రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి నడుపుకుంటూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. ముత్తువేల్ మాత్రం ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. రాయన్ తన చెల్లి జోలికి, తన తమ్ముళ్ల జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టడు. ఆ ఊళ్ళో దొరై(శరవణన్), సీతారాం(SJ సూర్య)లు రౌడీలుగా ఒకరికొకరు వేరువేరు గ్యాంగ్స్ తో ఉంటారు. ఆ ఊరికి పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్) అక్కడున్న రౌడీలని అంతం చేయడానికి పగతో వస్తాడు. అనుకోకుండా దొరై చనిపోతాడు. సీతారాం రాయన్ ని చంపించడానికి ట్రై చేస్తాడు. అసలు రాయన్ ని సీతారాం ఎందుకు చంపాలి అనుకుంటాడు? దొరైని ఎవరు చంపారు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ చెల్లి కోసం ఏం చేసాడు? తమ్ముళ్లు ఇద్దరు ఏం అయ్యారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Janhvi Kapoor : జూనియ‌ర్ ఎన్టీఆర్ పై జాన్వీక‌పూర్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ఎనర్జిటిక్ హీరో.. నాకు 10 రోజులు ఆయ‌న‌కు..

సినిమా విశ్లేషణ.. కథ పరంగా చూస్తే తన చెల్లి, ఫ్యామిలీని కాపాడుకోవడానికి అన్న ఏం చేసాడు. గతంలో అన్నయ్య, హిట్లర్.. లాంటి పలు సినిమాలు లాగే ఈ రాయన్ కూడా అంతే అనిపిస్తుంది. కానీ కథనం పరంగా కొత్త స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ ట్విస్ట్ లతో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో, ఊహించని క్లైమాక్స్ తో సరికొత్తగా చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా రాయన్ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ముత్తువేల్ ప్రేమ కథ చూపిస్తారు. దొరై – సీతారాం గొడవలు చూపించారు. ఇంటర్వెల్ ముందు దొరై మరణంతో ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ సీతారాం కథ, రాయన్ చెల్లి పెళ్లి, రాయన్ తమ్ముళ్ల కథ, రాయన్ తన చెల్లిని ఎలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకున్నాడు, రాయన్ కి ఏమైంది అని ఆసక్తికరంగా చూపించారు. ఇక సినిమా పరంగా ప్యూర్ తమిళ్ రా అండ్ రస్టిక్ సినిమాగానే ఉంటుంది. ఇలాంటి విజువల్స్ తో మన స్టార్ హీరోలు చేయడం మాత్రం కష్టమే. క్లైమాక్స్ కూడా అందరూ ఊహించేదానికి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా కొంచెం స్లో నేరేషన్ లో ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ధనుష్ కి ఇలాంటి రా అండ్ రస్టిక్ పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ధనుష్ తనలోని నటుడ్ని చాలా పాత్రల్లో చూపించాడు. ఈ సినిమాలో సైలెంట్ గా ఉంటూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. సందీప్ కిషన్ పక్కా తమిళ నటుడిలా ఒదిగిపోయి చేసాడు. సందీప్ కి మంచి పాత్ర పడింది. ఈ సినిమాతో సందీప్ కి తమిళ్ లో మరిన్ని అవకాశాలు రావొచ్చు. కాళిదాస్ జయరాం కూడా బాగా మెప్పించాడు.

ధనుష్ చెల్లి పాత్రలో చేసిన దుషారా విజయన్ మాత్రం అదరగొట్టేసింది. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా కనిపించి సెకండ్ హాఫ్ లో మాస్ పర్ఫార్మెన్స్ తో, యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టేసింది. అపర్ణ బాలమురళి కూడా నవ్విస్తూనే ఎమోషనల్ గా మెప్పిస్తుంది. SJ సూర్య, సెల్వ రాఘవన్, శరవణన్, ప్రకాష్ రాజ్.. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.

Image

సాంకేతిక అంశాలు.. సాంకేతికంగా కూడా రాయన్ సినిమా చాలా బాగుంది. మాములు బస్తి లొకేషన్స్ లో తీసి రియాలిటీకి దగ్గరగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా అందుకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ షాట్స్ లో కెమెరా వర్క్ చాలా బాగుంది. కథ పరంగా పాతది అయినా కొత్త కథనంతో ఆసక్తిగా రాశారు ధనుష్. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ధనుష్ కావడం గమనార్హం.

డైరెక్టర్ గా కూడా ధనుష్ ఆల్రెడీ గతంలోనే ‘పా పాండి’ సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు రాయన్ తో స్టార్ డైరెక్టర్ సినిమా తీసిన ఫీల్ తెచ్చాడు. ఇక AR రహమాన్ చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం యావరేజ్. నిర్మాణ పరంగా సన్ పిక్చర్స్ బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీగానే సినిమాని చూపించారు.

మొత్తంగా ‘రాయన్’ సినిమా తన చెల్లి కోసం ఓ అన్న ఏం చేసాడు అని రా అండ్ రస్టిక్ గా, ట్విస్టులతో చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.