KKR : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా కీల‌క నిర్ణ‌యం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టు రాత మారుస్తాడా..!

Shreyas Iyer - KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

KKR : ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా కీల‌క నిర్ణ‌యం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ జ‌ట్టు రాత మారుస్తాడా..!

Shreyas Iyer returns as Kolkata Knight Riders captain

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 సీజ‌న్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను తిరిగి నియ‌మించింది. గాయం కార‌ణంగా ఐపీఎల్ 2023 సీజ‌న్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి గైర్హాజ‌రీలో కోల్‌క‌తా జ‌ట్టును నితీశ్ రాణా న‌డిపించాడు. ప్ర‌స్తుతం అయ్య‌ర్ కోలుకుని క్రికెట్ ఆడుతూ వ‌చ్చే సీజ‌న్‌కు అందుబాటులోకి రావ‌డంతో తిరిగి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వైస్ కెప్టెన్‌గా నితీశ్ రాణా ఉంటార‌ని కేకేఆర్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయం కార‌ణంగా గ‌త సీజ‌న్‌(ఐపీఎల్ 2023)కు దూరం అవ్వ‌డం దుర‌దృష్ట‌క‌రం అని, ఇప్పుడు అత‌డు తిరిగి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు అందుకోనుండ‌డం నిజంగా ఆనందించ‌ద‌గ్గ విష‌యం అని కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు. గాయం నుంచి కోలుకునేందుకు అత‌డు ప‌డిన శ్ర‌మ‌, త‌న ఫామ్‌ను అందుకోవ‌డానికి ప‌డిన క‌ష్టం అత‌డి ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం అని చెప్పుకొచ్చారు.

శ్రేయ‌స్ ఆడ‌ని స‌మ‌యంలో నితీశ్ రాణా జ‌ట్టును న‌డిపించిన తీరు తీరు బాగుంద‌ని, ఈ సంద‌ర్భంగా నితీశ్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. వైస్ కెప్టెన్‌గానూ నితీశ్ త‌న జ‌ట్టు కోసం శ్రేయ‌స్‌కు అన్ని విధాలుగా మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేద‌న్నాడు.

అనేక‌ స‌వాళ్లు ఎదుర్కొన్నాం..

Shreyas Iyer

Shreyas Iyer

తిరిగి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకోవ‌డం ప‌ట్ల శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందం వ్య‌క్తం చేశాడు. గ‌త సీజ‌న్‌లో గాయం కార‌ణంగా తాను దూరం అవ్వ‌డంతో జ‌ట్టు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంద‌న్నాడు. కెప్టెన్‌గా త‌న స్థానాన్ని నితీశ్ రాణా భ‌ర్తీ చేశాడ‌న్నాడు. నితీశ్ నాయక‌త్వం బాగుంద‌న్నాడు. అత‌డిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు త‌న‌కు చాలా సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పాడు.

కాగా.. గ‌త సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆడిన 14 మ్యాచుల్లో కేవ‌లం ఆరు మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో నిలిచింది.

గంభీర్ సైతం..

2012, 2014 సీజ‌న్ల‌లో కోల్‌క‌తాకు రెండు ఐపీఎల్ టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ గౌత‌మ్ గంభీర్ గ‌త నెల‌లో తిరిగి సొంతం గూటికి చేరుకున్నాడు. 2018 సీజ‌న్‌కు ముందు గంభీర్‌ను కోల్‌క‌తా విడుద‌ల చేసింది. రిటైర్‌మెంట్ త‌రువాత గంభీర్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు రెండేళ్ల పాటు(2022, 2023సీజ‌న్ల‌లో) మెంటార్‌గా ప‌ని చేశాడు. న‌వంబ‌ర్‌లో అత‌డు కోల్‌క‌తాకు మెంట‌ర్‌గా వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని కేకేఆర్ సైతం ధృవీక‌రించింది.