Telangana Congress : ఇటు సీనియర్లు, అటు వలస నేతలు.. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ

ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.

Telangana Congress : ఇటు సీనియర్లు, అటు వలస నేతలు.. ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ

Telangana Congress Mp Tickets Race

Telangana Congress : ఎంపీ టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలామంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సేమ్ టైమ్ లో పార్టీలోకి వలస వస్తున్న నేతలు కూడా టికెట్ రేసులో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.

ఒక్కో సీటు నుంచి నలుగురు పోటీ..
ఎంపీ అభ్యర్థుల ఎంపిక తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది. నాలుగు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల కోసం వడపోత చేపడుతోంది. ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.

పార్టీలో చేరే వాళ్ల కోసం వెయిటింగ్..
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్‌ తర్వాత.. సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారని వెయిట్ చేశారు నేతలు. కానీ అధిష్టానం లిస్ట్‌ను పెండింగ్‌లో పెట్టింది. కొన్ని చోట్ల పార్టీలో చేరే వాళ్ల కోసం టికెట్ల కేటాయింపు ఆలస్యం అవుతోందని, ఇప్పటికి 9మంది అభ్యర్థులతో రెండో జాబితా సిద్ధమైందనేది ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్‌. అంతేకాదు చేరికలపై క్లారిటీ వస్తే ఏ క్షణమైనా రెండో జాబితా రిలీజ్ అవుతందని కూడా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

సికింద్రాబాద్ నుంచి దానం, భువనగిరి నుంచి పైళ్ల..
సెకండ్ లిస్ట్‌లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా షహనాజ్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి సునితా మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫామ్ అయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని.. భువనగిరి నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ అభ్యర్థిగా డా. సుమలత, వరంగల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి జంప్‌ అయిన సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ను బరిలోకి దించాలని భావిస్తోంది. పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించనుంది కాంగ్రెస్. నాగర్‌కర్నూల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లో ఇంకా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు.

ఖమ్మంలో భట్టి వర్సెస్ పొంగులేటి..
నాగర్ కర్నూల్‌ కాంగ్రెస్ టికెట్ కోసం సీనియర్ నేత మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మంలో భట్టి వర్సెస్ పొంగులేటిగా మారింది సిచ్యువేషన్. తన సతీమణి నందినీని బరిలోకి దించాలనుకుంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. నిజామాబాద్ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు టికెట్లు ఇవ్వమన్న రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్ ఆయనకు అడ్డంకిగా మారాయి. ప్రత్యామ్నాయంగా ఆకుల లలిత పేరును పరిశీలిస్తోంది అధిష్టానం. ఇక కరీంనగర్‌లో రెడ్డి వర్సెస్ వెలమ ఈక్వేషన్ కీలకంగా మారింది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ టికెట్ రేసులో ఉన్నారు.

 

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్