ఆ తప్పులు చేయొద్దని పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న చంద్రబాబు.. ఏంటా తప్పులు?

ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్‌గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతుండటం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు.

ఆ తప్పులు చేయొద్దని పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్న చంద్రబాబు.. ఏంటా తప్పులు?

Gossip Garage : మళ్లీ మళ్లీ అవే హెచ్చరికలు.. ఒకటికి పది సార్లు చెబుతున్న అధినేత… క్యాబినెట్‌ భేటీ అయినా, పార్టీ సమావేశమైనా… అసెంబ్లీ సెషన్స్‌ అయినా.. క్లాసు మాత్రం కామనే… అధినేత వెంటాడుతున్నా… కొందరు ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదా? ప్రభుత్వ ప్రతిష్ట కన్నా, తమ అధికార దర్పంతో వెలిగిపోవాలనే ఆలోచనే తప్పటడుగులు వేయిస్తోందా? కూటమి ఎమ్మెల్యేలపై వస్తున్న కంప్లైంట్స్‌తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ హెచ్చరిస్తున్నా.. మార్పు రావడం లేదెందుకు?

ఎవరో ఒకరు ఏదో ఒక వివాదం..
కూటమి ఎమ్మెల్యేల క్రమశిక్షణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేస్తున్న హెచ్చరికలను కొందరు లైట్‌ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు క్రమశిక్షణ కట్టు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ సైతం ఇదే అభిప్రాయం ఉండటంతో కూటమి ఎమ్మెల్యేలు అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 80 రోజులుగా కొందరు ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుండటాన్ని ప్రభుత్వాధినేత సీరియస్‌గా తీసుకుంటున్నారు. 164 మంది బలం ఉంది అనే ధీమాతో తప్పులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేశారని మనమూ అదే తప్పులు చేయాలా? అంటూ చంద్రబాబు, పవన్‌ సుతిమెత్తగా హెచ్చరిస్తున్నా…. కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఓ జిల్లా మంత్రి భార్య పోలీసులను అవమానించేలా ప్రవర్తించారని ఫిర్యాదులు రాగా, తాజాగా ఓ మాజీ మంత్రి భార్య పుట్టిన రోజు వేడుకలను పోలీసులు నిర్వహించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే సమయంలో ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగితే.. మరో ఎమ్మెల్యే భర్త రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై కొందరు ఫిర్యాదులు చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న ఈ అంశాలపై సీఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుండగా, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. ఐతే తమ వంతు ఇంకా రాలేదేమోనని అనుకుంటున్నారేమో కొందరు అవే తప్పులు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఓవర్ యాక్షన్ చేసిన వారి వల్ల గత ప్రభుత్వం ఏమైందో గుర్తించాలని వార్నింగ్..
రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలనేది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ఆలోచన. అందుకు తగ్గట్టే తమ ఎమ్మెల్యేలు పనితీరు, నడవడికపై సూచనలు, సలహాలిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలుకుతున్నారు. బూతులు మాట్లాడే వారు… ఓవర్‌ యాక్షన్‌ చేసిన వారి వల్ల గత ప్రభుత్వం ఏమైందో గుర్తించాలని చెబుతున్న సీఎం… తమకు ఆ పరిస్థితి రాకూండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఐతే అధినేత అలా చెప్పడం కామన్‌గా భావిస్తున్న నేతలు… ఎప్పటిలా తప్పులు చేయడమే చంద్రబాబు ఆగ్రహానికి కారణమవుతోందంటున్నారు.

రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే సత్ప్రవర్తన తప్పనిసరి అని క్లాస్..
మొత్తానికి ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్‌గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతుండటం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఐతే తమపై నిఘా ఉందన్న విషయం తెలియని ప్రజా ప్రతినిధుల బంధువులు రెచ్చిపోతూ.. బుక్కైపోతున్నారు. ప్రతి ఎమ్మెల్యే తాను జాగ్రత్తగా ఉండటంతోపాటు… తన కుటుంబ సభ్యుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచిస్తున్నారు. ఇలా చంద్రబాబు ఎమ్మెల్యేలను అదుపు చేయడం ఎప్పుడూ ఉండేదే అయినా.. ఈ సారి మోతాదు ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : వైసీపీ ఎంపీల రాజీనామా వెనుక జగన్ మాస్టర్ ప్లాన్? అప్పుడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారా?

గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై నియంత్రణ లేకే నష్టం..!
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై ఇలాంటి నియంత్రణ లేకపోవడం వల్లే ఎక్కువ ఆరోపణలు, విమర్శలు వచ్చాయనే అభిప్రాయం ఉంది. అందుకే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ టెన్‌ ప్లస్‌ వన్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి కూటమికి ఎదురుకాకూదంటే ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాలనేది సీఎం అంతరంగంగా చెబుతున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్‌ కూడా మద్దతుగా నిలుస్తుండటంతో కూటమి ఎమ్మెల్యేలు హై అలర్ట్‌లో ఉండాల్సి వస్తోంది.