Hydra: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ‘హైడ్రా’ నోటీసులు.. తిరుపతి రెడ్డి ఏమన్నారో తెలుసా?
ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్‌లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన బిల్డింగ్ కూడా ఆ పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు..

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టిపెట్టారు. ఆ చెరువును ఆనుకుని ప్రముఖులు ఖరీదైన భవనాలను నిర్మించుకున్నారు. అవి ఎఫ్టీఎల్ జోన్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ఎఫ్టీఎల్ జోన్‌లోనే తిరుపతి రెడ్డి నివాసం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. పలు కాలనీల్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు.
నోటీసులపై తిరుపతిరెడ్డి స్పందిస్తూ.. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తాను 2017లో నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టీఎల్‌లో ఉందన్న సమాచారం తన దగ్గర లేదని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్‌లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన బిల్డింగ్ కూడా ఆ పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యతరం లేదని తిరుపతి రెడ్డి అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు. అక్రమ కట్టడాలు నిర్మించింది ఎవరైనా సరే వదలబోమని కాంగ్రెస్ సర్కారు ముందు నుంచీ అంటోంది.
Also Read: చుక్కలు చూపిస్తున్న గద్వాల నయా జేజమ్మ