ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం.. ఎన్నికల వేళ కలకలం

Sangrur: ఎక్కడైనా లోకల్‌గా కల్తీ మద్యం తయారు చేస్తుంటే వెంటనే సమాచారం అందించాలని..

ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యం.. ఎన్నికల వేళ కలకలం

hooch tragedy

పార్లమెంట్‌ ఎన్నికల వేళ పంజాబ్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో ప్రజలు కల్తీ మద్యం తాగి మృత్యువాతపడుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే సంగ్రూర్‌ జిల్లాలో వరసగా 21 మంది కల్తీమద్యం కారణంగా కన్నుమూశారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి జనం వరసగా పిట్టల్లా రాలిపోతున్నారు. సంగ్రూర్‌ జిల్లాలో కల్తీ మద్యంతో మృతిచెందుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మద్యానికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో చాలాచోట్ల కల్తీ మద్యం ముఠాలు పుట్టుకొస్తున్నాయి. గ్యాంగులుగా ఏర్పడి ఇలా కల్తీ మద్యాన్ని తయారుచేసి లేబుల్స్‌ అంటించి అమ్మేస్తున్నారు. వీటిని తాగిన ప్రజలు మృత్యువాత పడుతున్నారు.

సంగ్రూర్‌ జిల్లాలో కల్తీమద్యం కారణంగా ఈ నెల 20న నలుగురు మృతి చెందారు. 21న నలుగురు.. 22న ఎనిమిదిమంది.. శనివారం 5గురు ప్రాణాలు వదిలారు.. దీంతో కల్తీ మద్యం కాటుకు మృతిచెందినవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. పటియాలాలోని రాజింద్రా ఆస్పత్రిలో మరికొంతమంది మృత్యువుతో పోరాడుతున్నారు.

వీరంతా ముఠాగా ఏర్పడి 
కల్తీమద్యం కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరో నలుగురికి దీంతో సంబంధాలున్నాయి. వీరంతా ముఠాగా ఏర్పడి ఒక ఇంట్లో కల్తీ మద్యాన్ని తయారు చేశారు. నిందితులిచ్చిన సమాచారంతో 200 లీటర్ల ప్రమాదకర ఇథనాల్‌ రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 156 బాటిళ్ల నకిలీమద్యం, లేబుల్స్‌ అంటించిన 130 బాటిళ్ల కల్తీ మద్యాన్ని, మరో 80 లేబుల్స్‌ లేని బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇథనాల్, మరికొన్ని హానికర రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేస్తున్నాయి ముఠాలు. వీటిని బాటిల్స్‌లో నింపి ప్రత్యేకంగా లేబుల్స్‌ అంటించి బ్రాండెడ్‌ మద్యం తరహాలో తక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. గ్రామాల్లో వీటిపై అవగాహనలేక లిక్కర్‌ తీసుకున్న ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

సంగ్రూర్‌ జిల్లాలో కూడా ఇదే జరిగిందని మెడికల్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది పంజాబ్‌ ప్రభుత్వం. దర్యాప్తు కోసం నలుగురు సభ్యులతో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా లోకల్‌గా కల్తీ మద్యం తయారు చేస్తుంటే వెంటనే సమాచారం అందించాలని పంజాబ్‌ ప్రభుత్వం, పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

రష్యాలో ఉగ్రదాడి ఘటన.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య