Chandragiri Assembly Constituency : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?

రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు రాజకీయం కొనసాగుతోంది. రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది. చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.

Chandragiri Assembly Constituency : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?

Chandragiri Assembly Constituency

Chandragiri Assembly Constituency : అది చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి… అక్కడ పసుపు జెండా ఎగిరి దాదాపు 30 ఏళ్లు అయింది. ఈసారైనా విక్టరీ కొట్టాలనేది టీడీపీ అధినేత టార్గెట్‌… మరోవైపు వైసీపీలో కీలక నేత చెవిరెడ్డికి ఈ ఎన్నికలు కీలకం… తన సిట్టింగ్‌ స్థానాన్ని కుమారుడికి అప్పగించిన చెవిరెడ్డి… తన వారసుడిని అసెంబ్లీకి పంపాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీంతో చంద్రగిరిలో హోరాహోరీ సమరమే జరుగుతోంది. మరి టఫ్‌ ఫైట్‌లో ఈ సారి గెలిచేదెవరు? చంద్రగిరి కోటపై ఎగిరే జెండా ఏది?

రెడ్డి వర్సెస్ కమ్మ.. కేవలం 3సార్లే గెలిచిన తెలుగుదేశం..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక నియోజకవర్గం చంద్రగిరి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రాయలకోట చంద్రగిరి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఉంటుంది. నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, బీసీ ఓటర్లే అధికం. దీంతో ఎన్నికల్లో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజికవర్గాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గంపై మాజీ మంత్రి గల్లా అరుణ కుమారిది చెరగని ముద్ర. నాలుగుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు అరుణకుమారి. కానీ, 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన అరుణకుమారి అటుపైనా రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించేశారు. అంతేకాదు 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం ఇక్కడ కేవలం మూడుసార్లే గెలిచింది. గత మూడు దశాబ్దాల్లో ఆ పార్టీ ఆచూకీయే చంద్రగిరిలో కనిపించకుండా పోయింది.

2014 నుంచి వైసిపి చేతుల్లోకి చంద్రగిరి..
టిడిపి అధినేత చంద్రబాబు సొంతగడ్డ చంద్రగిరి. 1978లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ చంద్రగిరిపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆయ సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం 2014 నుంచి వైసిపి చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గల్లా అరుణకుమారిని ఓడించగా, 2019లో టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై విజయం సాధించారు. గత 30 ఏళ్లలో చంద్రగిరిలో విజయం టీడీపీకి అందరిని ద్రాక్ష లాగే మారింది. రచ్చ గెలిచిన చంద్రబాబు ఇంట గెలవలేకపోతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి.

బరిలోకి కుమారుడు.. గెలుపే లక్ష్యం..
వైసీపీ నుంచి ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగారు. టిడిపి నుంచి పులివర్తి నాని పోటీ పడుతున్నారు. చంద్రగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే మంచి తరుణంగా భావించారు. తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అడగ్గానే టికెట్‌ కట్టబెట్టింది వైసీపీ. కుమారుడి గెలుపు కోసం గతేడాది నుంచి పక్కా వ్యూహంతో కదులుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదే సమయంలో ఆయన కూడా అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయ్యారు. దీంతో వారంలో ఐదు రోజులు ఒంగోలులో ఉంటున్న చెవిరెడ్డి చివరి రెండు రోజులు తిరుపతిలో ఉంటూ కుమారుడి గెలుపుకోసం పావులు కదుపుతున్నారు.

అటు ఒంగోలు గెలుపుతోపాటు ఇటు చంద్రగిరిలో కుమారుని గెలిపించే బాధ్యతలనూ చెవిరెడ్డే తీసుకున్నారు. మోహిత్ రెడ్డి సైతం తండ్రి బాటలో నడుస్తూ చంద్రగిరి నియోజకవర్గ మొత్తం కలియతిరుగుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి, మరో కుమారుడు సైతం మోహిత్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని మోహిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. గత ఐదేళ్లలో సుమారు 900 కోట్ల రూపాయలతో చంద్రగిరిలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు మోహిత్‌రెడ్డి.

ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు..
ఇక టిడిపి అభ్యర్థి పులివర్తి నానిలో కూడా ఇదే ధీమా కనిపిస్తోంది. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నాని 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు పులివర్తి నాని. చెవిరెడ్డి కుమారుడిపై విజయం తనకు సులువే అని భావిస్తున్నారు నాని. గత ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు పులివర్తి నాని. ఇదే సమయంలో ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంటింటా తిరుగుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకితే ఈ దఫా తనని గెలిపిస్తుందని అంటున్నారు నాని.

గెలుపుపై ఎవరి ధీమా వారిది..
మొత్తానికి చంద్రగిరిలో విజయంపై ఇరు పార్టీల్లోనూ ధీమా కనిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి పోటీ నుంచే తప్పుకోవడమే తన తొలి విజయమని చెబుతున్నారు టీడీపీ అభ్యర్థి నాని. ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం కుమారుడి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. లండన్ లో మాస్టర్స్ చేసిన మోహిత్ రెడ్డి అవివాహితుడు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం నియోజకవర్గ మొత్తం కలియ తిరుగుతున్నాడు. టిడిపి అభ్యర్థి నానిలో కూడా అదే కసి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి కొంత గుణపాఠాలు నేర్చుకున్న నాని… ఈ దఫా ఎలాగైనా చంద్రగిరి చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు.

సై అంటే సై..
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జనసేన, బిజెపి ప్రభావం నామమాత్రమే అంటున్నారు. కానీ, వైసీపీ, టీడీపీ మధ్య పోటీ తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు రాజకీయం కొనసాగుతోంది. రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది. చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?