Perni Nani : టీడీపీకి ఈసీ లొంగిపోయింది, అందుకే అక్కడ హింసాత్మక ఘటనలు- పేర్నినాని

ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

Perni Nani : టీడీపీకి ఈసీ లొంగిపోయింది, అందుకే అక్కడ హింసాత్మక ఘటనలు- పేర్నినాని

Perni Nani Fires On EC : ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈసీ టార్గెట్ గా సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలను ఈసీ అపహస్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీతో ఈసీ పొత్తు పెట్టుకున్నట్టు వ్యవహరించిందని ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసిందని, అందువల్లే ఈ ఘర్షణలు జరిగాయని వ్యాఖ్యానించారు.

పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పేర్నినానితో పాటు ముఖ్య నాయకులు డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై అల్లర్లను ప్రోత్సహించారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఘర్షణలు, అల్లర్లు చేసినా.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసినా.. ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.

టీడీపీకి ఈసీ లొంగిపోయిందన్నారు మాజీ మంత్రి పేర్నినాని. టీడీపీ కార్యకర్తలు కర్రలతో కొట్టినా కేసులు లేవన్నారు. వైసీపీ కార్యకర్తలు చేతులతో కొట్టినా 307 కేసులు పెట్టారని మండిపడ్డారు. టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందన్నారు.

ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు ఎక్కడ కుమ్మక్కు అయ్యారో అక్కడ దాడులు జరిగాయన్నారు. దీపక్ మిశ్రా అనే రిటైర్ట్ అధికారి నేరుగా పోలీసులను బెదిరించారని పేర్నినాని చెప్పారు. ఇన్ని గొడవలకి కారణం ఈ దీపక్ మిశ్రానే అని వ్యాఖ్యానించారు. ఎక్కడైతే అధికారులను ఈసీ మార్చిందో అక్కడే గొడవలు జరిగాయన్నారు పేర్నినాని.

పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో తమ పార్టీ నేతలపై జరిగిన దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగ నాగార్జున, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి.. నేరుగా డీజీపీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు.

పోలీసులు ఫెయిల్ అయ్యారు, అధికారులను ఈసీ బదిలీ చేశాకే గొడవలు- అంబటి రాంబాబు
పోలింగ్ రోజు నుండి నేటి వరకు జరిగిన హింసత్మకమైన ఘటనలపై ఫిర్యాదు చేశాం. ఈ మధ్య కాలంలో ఏ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఇలాంటి దుస్థితి రావడం చాలా దారుణం. పోలీసు వ్యవస్థలో కొందరు టీడీపీతో కుమ్మక్కయ్యారని అనుమానం ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులను ఎక్కువగా పెట్టారు. టీడీపీ అనుకూల ప్రాంతాల్లో పోలీసులను పెట్టలేదు. చాలాచోట్ల అన్ని అయిపోయాక పోలీసులు వచ్చారు. మమల్ని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ వాళ్ళని తిరగనిచ్చారు.

పల్నాడులో ఫైరింగ్ చేశారు. ఈరోజు కొందరిని అరెస్ట్ చేశారు. అన్నీ అయిపోయాక ఈరోజు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికల కమిషన్ అధికారులను బదిలీ చేసింది. ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు, చాలామంది పోలీసు అధికారులను మార్చారు. అధికారులను మార్చాక గొడవలు జరిగాయి. డీజీపీ సహా కొందరు ఎస్పీలను మార్చారు. వాళ్ళకి అవగాహన లేదు. ఎన్నికల కమిషన్ మార్పుల వల్ల ఇలా జరిగింది. పోలింగ్ అయిపోయాక ఏమి యాక్షన్ తీసుకున్నా ఏం ఉపయోగం?